Karnataka: నేను ఓడితేనేం.. నా పంతం నెగ్గింది అదే చాలు: జగదీశ్ శెట్టర్

  • 40 ఏళ్లుగా బీజేపీతోనే ఉన్న జగదీశ్ శెట్టర్
  • టికెట్ నిరాకరించడంతో చివరి క్షణంలో కాంగ్రెస్ తీర్థం
  • హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ నుంచి బరిలోకి దిగి శిష్యుడి చేతిలో ఓటమి పాలైన శెట్టర్
  • తనను ఓడించేందుకు బీజేపీ డబ్బులు పంచిందని ఆరోపణ
Jagadish Shettar Accusations on BJP After Karnataka Results

కర్ణాటక అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో చివరి క్షణంలో కాంగ్రెస్‌లో చేరి ఓటమి పాలైన మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాదాపు 40 సంవత్సరాలుగా బీజేపీతోనే ఉన్న ఆయనకు టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిరాకరించింది. దీంతో చివరి క్షణంలో కాంగ్రెస్‌లో చేరి హుబ్లి-ధార్వాడ్ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. భారీ మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేసిన ఆయన తన శిష్యుడైన బీజేపీ నేత మహేశ్ టెంగినకాయ్ చేతిలో 34 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు.

తన ఓటమికి బీజేపీ బాగా డబ్బులు పంచిందని జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. అయితే, తాను ఓడినా తన పంతం మాత్రం నెగ్గిందని, చాలా తృప్తిగా ఉందని వ్యాఖ్యానించారు. తనకు టికెట్ నిరాకరించిన బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటుందని అప్పుడే చెప్పానని, తన ప్రభావం 20-25 స్థానాలపై ఉంటుందని తాను చెప్పింది నిజమైందని అన్నారు. 

ఆ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించిందన్నారు. లింగాయత్‌లు తన వెంటే ఉన్నారని, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటేశారని పేర్కొన్నారు. తనను ఓడించినా రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఓడిందని అన్నారు. వాళ్ల లక్ష్యం తనను ఓడించడమేనా? ఇదేనా వారి అంతిమ లక్ష్యం అని బీజేపీపై దుమ్మెత్తిపోశారు.

More Telugu News