Kumaraswamy: ఎన్నికల ఫలితాలపై కుమారస్వామి స్పందన

  • కర్ణాటక ప్రజల తీర్పును గౌరవిస్తున్నామన్న కుమారస్వామి
  • గెలుపు, ఓటమిని సమానంగా స్వీకరిస్తామని వ్యాఖ్య
  • కొత్త ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానన్న స్వామి
Kumaraswamy response on election results

కర్ణాటక ప్రభుత్వ ఏర్పాటులో కింగ్ మేకర్ పాత్రను పోషించాలనుకున్న కుమారస్వామికి చివరకు నిరాశ మిగిలింది. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ దక్కడంతో జేడీఎస్ అవసరం ఆ పార్టీకి లేకపోయింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మరోవైపు ఎన్నికల ఫలితాలపై కుమారస్వామి స్పందిస్తూ... కర్ణాటక ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే అంతిమ నిర్ణయమని అన్నారు. గెలుపు, ఓటమిని తాము సమానంగా స్వీకరిస్తామని చెప్పారు. ఈ ఓటమే తమకు ఫైనల్ కాదని అన్నారు. తాము ఎప్పుడూ ప్రజలతోనే ఉంటామని తెలిపారు. 

ఓటమి తనకు కానీ, తన కుటుంబానికి కానీ కొత్త కాదని కుమారస్వామి అన్నారు. గతంలో తాను, తన తండ్రి దేవెగౌడ, తన సోదరుడు రేవణ్ణ కూడా ఓడిపోయామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అధికారంలోకి రానున్న కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెపుతున్నానని... నూతన ప్రభుత్వం ప్రజల అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నానని అన్నారు.

More Telugu News