CBI: వివేకా హత్యాస్థలిలో దొరికిన లేఖకు నిన్ హైడ్రిన్ పరీక్ష... పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ

CBI files petition to conduct Ninhydrine test for Viveka suicide note
  • వివేకా లేఖపై వేలిముద్రలు గుర్తించేందుకు సీబీఐ కసరత్తు
  • ఆ లేఖను వివేకానే ఎంతో ఒత్తిడి నడుమ రాశారని ఇప్పటికే తేల్చిన సీఎఫ్ఎస్ఎల్
  • వేలిముద్రలు కూడా గుర్తించాలని సీఎఫ్ఎస్ఎల్ ను కోరిన సీబీఐ
  • నిన్ హైడ్రిన్ పరీక్ష చేయాల్సి ఉంటుందన్న సీఎఫ్ఎస్ఎల్
  • ఇదే అంశాన్ని కోర్టుకు నివేదించిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తున్న సీబీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై నిన్ హైడ్రిన్ పరీక్షకు అనుమతించాలని సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

వివేకా రాసిన లేఖపై వేలిముద్రలను గుర్తించేందుకు సీబీఐ కసరత్తు చేస్తోంది. వివేకా హత్య జరిగిన స్థలంలో లభ్యమైన లేఖను సీబీఐ 2021 ఫిబ్రవరి 11న కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్)కు పంపించింది. తీవ్ర ఒత్తిడి నడుమ ఆ లేఖను వివేకానే రాసినట్టుగా సీఎఫ్ఎస్ఎల్ ఇప్పటికే నిర్ధారించింది. 

తాజాగా లేఖపై వేలిముద్రలను కూడా గుర్తించాలని సీబీఐ అధికారులు సీఎఫ్ఎస్ఎల్ ను కోరారు. లేఖపై వేలిముద్రల గుర్తింపునకు నిన్ హైడ్రిన్ పరీక్ష చేయాల్సి ఉంటుందని సీఎఫ్ఎస్ఎల్ స్పష్టం చేసింది. అయితే, ఈ పరీక్ష జరిపితే లేఖపై రాత, ఇంకు దెబ్బతినే అవకాశం ఉంటుందని సీఎఫ్ఎస్ఎల్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే, సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. 

నిన్ హైడ్రిన్ పరీక్షతో చేతిరాత, ఇంకు దెబ్బతినే అవకాశాలున్నాయన్న విషయాన్ని ముందుగానే కోర్టుకు తెలియజేశారు. లేఖపై వేలిముద్రలు ఎవరివో తేల్చడం ఈ కేసుకు చాలా ముఖ్యమని, లేఖపై నిన్ హైడ్రిన్ టెస్టుకు అనుమతించాలని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. లేఖపై వేలిముద్రలను అనుమానితుల వేలిముద్రలతో పోల్చాల్సి ఉందని తెలిపారు. రికార్డుల్లో ఒరిజనల్ లేఖకు బదులు కలర్ జిరాక్స్ ను అనుమతించాలని కోర్టుకు విన్నవించారు. 

సీబీఐ తాజా పిటిషన్ నేపథ్యంలో, సీబీఐ కోర్టు నిందితుల స్పందన కోరింది. సీబీఐ పిటిషన్ పై జూన్ 2న విచారణ జరపనుంది.
CBI
YS Vivekananda Reddy
Suicide Note
Ninhydrine Test
Fingerprints
CBI Court

More Telugu News