Uddhav Thackeray: అవసరమైతే మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్తా: ఉద్ధవ్ థాకరే

  • ఎన్నికలకు వెళ్దాం రమ్మంటూ షిండే వర్గం, బీజేపీకి ఉద్ధవ్ సవాల్
  • ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారని వ్యాఖ్య 
  • నైతిక బాధ్యత వహించి ఏక్ నాథ్ షిండే రాజీనామా చేయాలని డిమాండ్
  • తిరుగుబాటు ఎమ్మెల్యేలను స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలన్న మాజీ సీఎం
lets all face elections says uddhav thackeray a day after supreme court order

‘శివసేన వర్సెస్ శివసేన’ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం ఏక్ నాథ్ షిండే, బీజేపీకి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే సవాలు విసిరారు. ఎన్నికలకు వెళ్దాం రమ్మంటూ చాలెంజ్ చేశారు. 

శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఎన్నికలకు వెళ్దాం రండి. ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారు. నేను రాజీనామా ఇచ్చినట్టే, నైతిక బాధ్యత వహించి సీఎం ( ఏక్ నాథ్ షిండే) కూడా రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు. 

గత ఏడాది తిరుగుబాటు చేసి, తన ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన శివసేన ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దీనిపై నిర్ణీత సమయంలోగా తగిన నిర్ణయం తీసుకోకుంటే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతం స్పీకర్ విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగి రాగానే.. ఎమ్మెల్యేపై అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలి’’ అని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. 

‘‘దేశంలో నిస్సిగ్గు వ్యవహారాలు జరుగుతున్నాయని, వాటిని ఆపాలని ప్రధాన మంత్రిని కోరుతున్నా. మహారాష్ట్ర పేరు ప్రతిష్ఠలను దిగజార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటివి జరగడానికి వీల్లేదు’’ అని అన్నారు.

గతేడాది మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమయంలో మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో కోష్యారీపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ డిమాండ్ చేశారు. ఒకరిపై చర్యలు తీసుకుంటే.. ఇంకెవరూ ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయరని అన్నారు.

More Telugu News