Mokha: సుడులు తిరుగుతున్న 'మోఖా' తుపాను... చిత్రీకరించిన ఇన్ శాట్ ఉపగ్రహం

INSAT 3DR captures Mokha very severe cyclone
  • మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో మోఖా తుపాను
  • ఈ ఉదయానికి అతి తీవ్ర తుపానుగా బలపడిన వైనం
  • బంగ్లాదేశ్, మయన్మార్ తీరాల దిశగా పయనం
  • గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న మోఖా
  • తీరం చేరే సమయంలో విలయం తప్పదంటున్న వాతావరణ నిపుణులు
బంగాళాఖాతంలో ఏర్పడిన మోఖా తుపాను మరింత బలపడి ఈ ఉదయం అతి తీవ్ర తుపానుగా మారింది. మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న మోఖా తుపాను ఉత్తర దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. 

కాగా, మోఖా తుపానును అంతరిక్షం నుంచి భారత వాతావరణ ఉపగ్రహం ఇన్ శాట్-3డీఆర్ చిత్రీకరించింది. వందల కిలోమీటర్ల దూరం నుంచి గాలులను, మేఘాలను బలంగా ఆకర్షిస్తూ, సుడులు తిరుగుతున్న మోఖా తుపాను వలయాన్ని ఇన్ శాట్ ఉపగ్రహంలోని అత్యాధుని కెమెరాలు బంధించాయి. ఇందులో సైక్లోన్ ఐ (మధ్యభాగం) స్పష్టంగా ఏర్పడిన వైనం వెల్లడవుతోంది. 

ఇక, మోఖా తుపానుపై భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) తాజా బులెటిన్ విడుదల చేసింది. పోర్టుబ్లెయిర్ కు పశ్చిమ వాయవ్య దిశగా 530 కిమీ దూరంలోనూ, బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ కు దక్షిణ నైరుతి దిశగా 950 కిమీ దూరంలోనూ, మయన్మార్ లోని సిట్వే తీరానికి దక్షిణ నైరుతి దిశగా 870 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. 

ఇది మరింత బలపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తుందని, మే 14 మధ్యాహ్నం నాటికి కాక్స్ బజార్ (బంగ్లాదేశ్), క్యాక్ ప్యు (మయన్మార్) మధ్య తీరం దాటనుందని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... ఏపీ, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 

మోఖా తీరం చేరితే బంగ్లాదేశ్, మయన్మార్ లో విలయం తప్పదని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. భూభాగంపైకి చేరే సమయానికి మోఖా తీవ్ర తుపానుగానే ఉంటుందని, గంటకు 175 కిమీ వేగంతో వీచే గాలులకు, కుంభవృష్టి వర్షాలకు పేద దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్ అల్లకల్లోలం అవుతాయని అంచనా వేస్తున్నారు.
Mokha
Cyclone
INSAT-3DR
Bay Of Bengal

More Telugu News