Congress: బీజేపీ-కాంగ్రెస్ దూషణల పర్వం.. ఇరు పార్టీలకు నోటీసులిచ్చిన ఎన్నికల సంఘం

Karnataka polls Election Commission notice to Congress and BJP
  • కాంగ్రెస్‌పై పలు ఆరోపణలు చేస్తూ ఇంగ్లిష్ దినపత్రికలో బీజేపీ ప్రకటన
  • నిరాధార ఆరోపణలంటూ కాంగ్రెస్ ఫిర్యాదు
  • ఆధారాలు సమర్పించాలని బీజేపీకి ఈసీఐ ఆదేశం
  • ఖర్గే ట్వీట్‌పై బీజేపీ ఫిర్యాదు
హోరాహోరీగా జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఒకదానిపై ఒకటి తీవ్రంగా విరుచుకుపడ్డాయి. దూషణల పర్వానికి దిగాయి. ఈ నేపథ్యంలో ఓ పార్టీపై మరోటి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసుకున్నాయి. దీంతో ఇరు పార్టీలకు భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నోటీసులు జారీ చేసింది. ఓ ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రికలో బీజేపీ ప్రకటన ఇస్తూ కాంగ్రెస్‌పై నిరాధారమైన ఆరోపణలు చేసిందని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా ఈసీకి ఫిర్యాదు చేశారు. 

దీనికి స్పందించిన ఎన్నికల సంఘం ఆ ప్రకటనల్లో చేసిన ఆరోపణలకు సంబంధించి నమ్మదగిన ఆధారాలు సమర్పించాలని ఆదేశిస్తూ బీజేపీకి నోటీసులు జారీ చేసింది. నేటి రాత్రి 8 గంటల వరకు గడువు ఇచ్చింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని కోరింది.

ఎన్నికల ప్రచారంలో చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉండాలని ఈసీఐ పేర్కొంది. నిరాధార ఆరోపణలు చేయడమంటే ఓటర్లను తప్పుదోవ పట్టించడమే కాకుండా సరైన అభ్యర్థిని ఎంచుకునే హక్కును వారి నుంచి దోచుకోవడమేనని పేర్కొంది. 

అలాగే, బీజేపీ నేతలు భూపేందర్ యాదవ్, డాక్టర్ జితేందర్ సింగ్, తరుణ్ చుగ్, అనిల్ బలూని, పాఠక్‌లు ఈసీకి ఫిర్యాదు చేస్తూ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన ట్వీట్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. మే 6న ఖర్గే ట్వీట్ చేస్తూ.. కర్ణాటక ప్రతిష్ఠ, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగేందుకు కాంగ్రెస్ ఎవరినీ అనుమతించబోదని స్పష్టం చేశారు.

బీజేపీ నేతల ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. సోషల్ మీడియా పోస్టుపై వివరణ ఇవ్వాలని ఖర్గేను ఆదేశించింది. ‘సార్వభౌమాధికారం’ పదాన్ని ఏ  సందర్భంలో ఉపయోగించారో చెప్పాలని కోరింది.
Congress
Karnataka
BJP
Mallikarjun Kharge
Karnataka Polls

More Telugu News