IAF: భారత గగనతలాన్ని ఉపయోగించుకున్న పాకిస్థాన్ బోయింగ్ జెట్‌లైనర్.. జాగ్రత్తగా పర్యవేక్షించిన ఐఏఎఫ్!

  • ఈ నెల 4న మస్కట్ నుంచి బయలుదేరిన విమానం
  • లాహోర్‌లో ల్యాండ్ కావాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం కారణంగా విఫలం
  • భారత గగనతలాన్ని ఉపయోగించుకుని తిరిగి ముల్తాన్‌కు మళ్లింపు
  • పరస్పరం సహకరించుకున్న ఢిల్లీ-లాహోర్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కార్యాలయాలు
Air Force Kept Watch As Pak Plane Entered Indian Airspace In Poor Weather

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 777 జెట్‌లైనర్ గతవారం భారత గగనతలాన్ని ఉపయోగించుకోవడాన్ని భారత వాయసేన క్షుణ్ణంగా పర్యవేక్షించింది. భారీ వర్షానికి తోడు ల్యాండింగ్‌కు అనుకూల పరిస్థితులు లేకపోవడంతో పాక్ విమానం లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడంలో విఫలమైంది. దీంతో అది భారత గగనతలాన్ని వాడుకుని ఆపై ముల్తాన్‌కు వెళ్లి ల్యాండ్ అయింది. మే 4న ఈ విమానం మస్కట్‌లో బయలుదేరింది. లాహోర్‌లోని అల్లామ్ ఇక్బాల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ల్యాండ్ కాలేకపోయింది.

అక్కడి పరిస్థితులపై అప్రమత్తమైన ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్.. ఆ ప్రాంతంలోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు చేసిన అభ్యర్థనను ప్రాసెస్ చేసింది. ఈ క్రమంలో లాహోర్-ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పరస్పరం సహకరించుకున్నట్టు భారత ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి.  

ప్రపంచవ్యాప్తంగా విమానాల కదలికలను ట్రాక్ చేసే ‘ఫ్లైట్ రాడార్ 24’ ప్రకారం.. పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ జెట్ లైనర్ విమానం మే 4న భారత గగనతలంలోకి ప్రవేశించిన కాసేపటికే పంజాబ్‌లోని భిఖివింద్ పట్టణానికి ఉత్తరంగా రాత్రి 8.42 గంటల సమయంలో ప్రయాణించింది. ఆ తర్వాత అది నైరుతి వైపుగా తిరిగి తర్న్ తరణ్ మీదుగా ప్రయాణిస్తూ తిరిగి పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత దానిని ముల్తాన్‌కు మళ్లించి అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో భారత్ ఎయిర్‌ఫోర్స్ ఎలాంటి యుద్ధ విమానాలను రంగంలోకి దింపలేదని తెలుస్తోంది. 

కౌలాలంపూర్, బ్యాంకాక్ విమానాలు సహా భారత గగనతలం మీదుగా విమానాలు నడిపేందుకు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు అనుమతి ఉంది. భారత్‌లోని పలు విమానయాన సంస్థలు కూడా పాకిస్థాన్ గగనతలం మీదుగా పశ్చిమ దేశాలకు రోజువారీ విమానాలు నడుపుతున్నాయి.

More Telugu News