Brownsville: టెక్సాస్ లో మరో ఘోరం.. జనంపైకి దూసుకెళ్లిన కారు, ఏడుగురి మృతి

SUV Runs Over 7 Waiting For Bus in Brownsville Texas
  • బ్రౌన్స్ విల్లేలో ఆదివారం దారుణ ప్రమాదం
  • రెడ్ లైట్ పడినా ఆగకుండా దూసుకొచ్చిన డ్రైవర్
  • బస్టాండ్ లో వెయిట్ చేస్తున్న వారిని వేగంగా ఢీ కొట్టిన వైనం
అమెరికాలోని టెక్సాస్ లో మరో దారుణం చోటుచేసుకుంది. అలెన్ పట్టణంలోని మాల్ లో కాల్పుల ఘటనలో ఎనిమిది మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటన జరిగిన మరుసటి రోజే కారు ప్రమాదం జరిగింది. బ్రౌన్స్ విల్లేలోని ఓ బస్ స్టాండ్ లో వేచి ఉన్న వారిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. మరో పదిమంది గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం బ్రౌన్స్ విల్లేలోని ఓ వలసదారుల సహాయక కేంద్రం దగ్గర్లో ఉన్న బస్ స్టాప్ లో ఈ దారుణం జరిగింది.

ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారు చెప్పిన వివరాల ప్రకారం.. బస్ స్టాపులో చాలామంది బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. అక్కడి ప్లాట్ ఫారంపై కొంతమంది కూర్చుని ఉండగా, ఇంకొందరు నిల్చున్నారు. ఇంతలో ఓ కారు వేగంగా దూసుకు రావడం గమనించారు. ప్రమాదం గుర్తించి తప్పుకునేందుకు ప్రయత్నించేలోగా కారు తమను ఢీ కొట్టిందన్నారు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని వివరించారు. ఇదంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాలోనూ రికార్డ్ అయింది. రెడ్ సిగ్నల్ పడినా కారును ఆపకుండా వచ్చిన డ్రైవర్.. ఉద్దేశపూర్వకంగానే తమపైకి కారును పోనిచ్చాడని బాధితులు ఆరోపించారు. ప్రమాదానికి ముందు తమను కించపరిచేలా చేతివేళ్లతో సైగ చేసిందని చెప్పారు.

బస్ స్టాప్ లోని జనాన్ని ఢీ కొట్టిన తర్వాత కారు కూడా బోల్తా పడింది. దీంతో డ్రైవర్ గాయపడగా.. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు ప్రమాదం ఉద్దేశపూర్వకంగానే జరిగిందని బాధితులు ఆరోపిస్తుండగా.. ప్రస్తుతానికి ప్రమాద ఘటనగానే నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.
Brownsville
USA
texas
suv
accident

More Telugu News