COVID19: కరోనా సంక్షోభ శకం ముగిసింది..డబ్ల్యూహెచ్ఓ ప్రకటన

  • కరోనా కారణంగా విధించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ఎత్తేసిన డబ్ల్యూహెచ్ఓ
  • కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోలేదని స్పష్టీకరణ
  • ఈ మూడేళ్లలో 7 మిలియన్ ల మందిని పొట్టనపెట్టుకున్న కరోనా
who declares covid no longer global health emergency

మూడేళ్ల పాటు ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టిన కరోనా సంక్షోభ శకం ముగిసిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తాజాగా ప్రకటించింది. కరోనా కారణంగా విధించిన గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని తొలగిస్తున్నట్టు పేర్కొంది. అయితే, ప్రపంచంలో కరోనా వ్యాధి పూర్తిగా తొలగిపోలేదని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది. అత్యయిక స్థితి విధించాల్సిన పరిస్థితులు మాత్రమే తొలగిపోయాయని పేర్కొంది. ఇటీవల దక్షిణాసియా, మధ్యప్రాచ్యంలో కరోనా కేసుల పెరుగుదలను కూడా ప్రస్తావించిన డబ్ల్యూహెచ్ఓ.. ప్రతి వారం ఈ వ్యాధికి వేల మంది బలవుతున్నారని పేర్కొంది. 

2020 జనవరి 30న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా వైరస్‌ను ప్రపంచ సంక్షోభంగా ప్రకటించింది. అప్పటికీ వైరస్‌కు కొవిడ్-19 అన్న పేరు స్థిరపడలేదు. కరోనా పుట్టినిల్లు అయిన చైనాలోనూ అప్పటికి కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి. 

ఈ మూడేళ్ల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 764 మిలియన్ కరోనా కేసులు వెలుగు చూశాయి. 7 మిలియన్ ల మంది కరోనాకు బలయిపోయారు. 5 బిలియన్ ల మందికి కరోనా టీకాలు అందాయి. ఇక అమెరికాలోనూ మే 11న కరోనా అత్యయిక స్థితి ముగియనుంది. దీంతో, తప్పనిసరి టీకాకరణ, ఇతర కరోనా కట్టడి చర్యలకు ప్రభుత్వం ముగింపు పలుకుతుంది. గతేడాదే జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు కఠిన కరోనా కట్టడి చర్యలకు స్వస్తి పలికాయి.

More Telugu News