'ఉగ్రం' - మూవీ రివ్యూ

Ugram

Movie Name: Ugram

Release Date: 2023-05-06
Cast: Allari Naresh, Mirnaa Menon, Nawab Shah, Shatru, Indraja, Sharath Lohithashwa,
Director:Vijay Kanakamedala
Producer: Sahu Garapati
Music: Sricharan Pakala
Banner: Shine Screens
Rating: 3.25 out of 5
  • అల్లరి నరేశ్ ను కొత్తగా చూపించిన 'ఉగ్రం'
  • ఆసక్తికరమైన కథాకథనాలు 
  • పెరుగుతూ వెళ్లిన హింస 
  • టేకింగ్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ హైలైట్
  • ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చే సినిమా 

అల్లరి నరేశ్ అనగానే గుర్తుకు వచ్చేది ఆయన చేసిన కామెడీ. రాజేంద్రప్రసాద్ తరువాత ఆ స్థాయి కామెడీని పరుగులు తీయించిన నటుడు. అడపా దడపా విలక్షణమైన పాత్రలను చేస్తూ వచ్చిన ఆయన, ఇక ప్రేక్షకులు తన నుంచి కొత్తదనాన్ని కోరుకుంటున్నారని భావించి, విజయ్ కనకమేడల దర్శకత్వంలో 'నాంది' సినిమా చేశాడు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో, ఇప్పుడు అదే దర్శకుడితో 'ఉగ్రం' సినిమాను చేశాడు. ఈ శుక్రవారం థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఏ స్థాయిలో ఆడియన్స్ కి కనెక్ట్ అయిందనేది చూద్దాం. 

పోలీస్ ఆఫీసర్ శివకుమార్ (అల్లరి నరేశ్)లో నిజాయతీ ఎక్కువ. పెద్ద పెద్ద రాజకీయనాయకుల సిఫార్సులను ఎంతమాత్రం లెక్కచేయని ధైర్యసాహసాలు ఆయన సొంతం. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అపర్ణ (మిర్నా) .. కూతురు లక్కీ అంటే అతనికి ప్రాణం. అయినా కుటుంబానికంటే, సాధారణ ప్రజలకు అండగా నిలబడటానికే ఆయన ప్రాధాన్యతనిస్తూ ఉంటాడు. ముఖ్యంగా ఆడపిల్లలను వేధించే వారి విషయంలో ఆయన మరింత కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు. 

పేద పిల్లలకి సంబంధించిన ఒక గర్ల్స్ హాస్టల్ దగ్గర కొంతమంది రౌడీలు కాపుకాసి వేధిస్తూ ఉంటారు. ఆ గ్యాంగ్ లో ఉన్న నలుగురికి తనదైన స్టైల్లో బుద్ధి చెబుతాడు. దాంతో ఆ గ్యాంగ్ ఆయనపై పగబడుతుంది. శివకుమార్ భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తుంది. ఈ విషయం తెలిసి నేరుగా వాళ్ల అడ్డాకి వెళతాడు శివకుమార్. తనపై దాడి చేయడానికి ప్రయత్నించినవారిని అక్కడే షూట్ చేస్తాడు. అయితే వారిలో 'గని' అనేవాడు తప్పించుకుంటాడు.

అయితే శివకుమార్ తీరు పట్ల అసహనంతో  పుట్టింటికి వెళ్లిపోవాలని అపర్ణ నిర్ణయించుకుంటుంది. తానే అక్కడ దిగబెడతానని  బయల్దేరతాడు శివకుమార్. ఆ రాత్రివేళ రోడ్డు ప్రమాదానికి గురవుతారు. తలకి బలమైన గాయం కావడం వలన, ఏ మాత్రం టెన్షన్ పడినా ప్రాణాలకి ప్రమాదమని శివకుమార్ తో డాక్టర్లు చెబుతారు. ప్రమాదం జరిగిన చోటు నుంచి అపర్ణ - లక్కీ అదృశ్యమవుతారు. వాళ్ల గురించి కనుక్కుందామంటే, ముగ్గురు రౌడీలను షూట్ చేసిన కారణంగా కోర్టు అతణ్ణి పోలీసుల పర్యవేక్షణలో ఉంచుతుంది. 

ఒక వైపున తన ఆరోగ్యం సహకరించకపోయినా, అక్కడి నుంచే శివకుమార్ తన ప్రయత్నాలు మొదలెడతాడు. తన భార్య బిడ్డలకు ముందు మిస్సింగ్ కేసులను గురించి ఆరాతీయడం మొదలుపెడతాడు. అలా మిస్సింగ్ అవుతున్న వారి కేసులు వందల్లో తన దృష్టికి వస్తాయి. అప్పుడు శివకుమార్ ఏం చేస్తాడు? ఆయన భార్యా బిడ్డలను ఎవరు కిడ్నాప్ చేశారు? వందల్లో జరుగుతున్న ఈ కిడ్నాప్ ల వెనుక ఎవరున్నారు? ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు? అనేది మిగతా కథ. 

'ఉగ్రం' టైటిల్ రక్తపు ధారలతోనే డిజైన్ చేశారు .. అలా మొదలైన ఈ కథ హింసతోనే ఎక్కువగా నడుస్తుంది. కాకపోతే ఆ హింస వెనుక ఒక బలమైన ఎమోషన్ ఉండేలా దర్శకుడు విజయ్ కనకమేడల డిజైన్ చేసుకున్నాడు. తూము వెంకట్ రాసిన ఈ కథను ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో దర్శకుడు చాలా వరకూ సక్సెస్ అయ్యాడు. ఇంటర్వెల్ వరకూ కూడా తన చుట్టూ ఏం జరుగుతుందనేది హీరోకి అర్థం కాదు. ఆయనతో పాటు అదేమిటో తెలుసుకోవాలనే ఉత్కంఠతో ప్రేక్షకులు ఉంటారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ తరువాత కథపై మరింత ఆసక్తిని పెంచేదిలా ఉంటుంది. 

ఒక వైపున హీరో తానున్న పరిస్థితి వలన ఏ విషయాన్ని గురించి తీవ్రంగా ఆలోచన చేయకూడదు. అలా ఆలోచన చేస్తేనేగాని తన భార్యాబిడ్డలతో పాటు, మిస్సైన మిగతావారిని గురించి తెలుసుకోలేడు. ఆరోగ్య సమస్యలను లెక్కచేయకుండా ముందుకు వెళదామా అంటే, తను కోర్టు పరిధిలో .. పోలీసుల అధీనంలో ఉన్నాడు. ఇన్ని వైపుల నుంచి హీరోను టైట్ చేసి దర్శకుడు కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. 

ఓపెనింగ్ సీన్ .. నకిలీ హిజ్రాల ఛేజింగ్ .. వాళ్లతో ఫైట్ ఎపిసోడ్ ను డైరెక్టర్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.  భార్య భర్తల అనుబంధం .. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ ను కనెక్ట్ చేసిన విధానం బాగుంది. ఫైట్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయని చెప్పచ్చు. హీరో ఉన్న పరిస్థితులు .. అతనిలోని ఆవేశం .. ఆక్రోశం వలన, ఆ ఫైట్స్ అతిగా కూడా అనిపించవు. అల్లరి నరేశ్ నటన నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంది.  కథ పరంగా ఈ సినిమాకి గ్లామరస్ హీరోయిన్ అవసరం లేకపోయినా, లుక్ పరంగా కూడా  హీరోయిన్ మిర్నా మీనన్ ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. 

డాక్టర్ పాత్రలో ఇంద్రజ మెప్పించింది .. అయితే ఆమెకి ఆ హెయిర్ స్టైల్ సెట్ కాలేదు. ఇక తెరపైకి కాస్త లేట్ గా వచ్చినా, ప్రతినాయకుడిగా నవాబ్ షా మెప్పించాడు. శత్రు .. శరత్ లోహితశ్వ .. శ్రీకాంత్ అయ్యంగార్ పాత్ర పరిధిలో నటించారు. శ్రీచరణ్ పాకాల బాణీల గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు గానీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం సన్నివేశాలకి ఆడియన్స్ ను బలంగా కనెక్ట్ చేస్తుంది. సిద్ధార్థ్ జై ఫొటోగ్రఫీకి ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. ముఖ్యంగా రాత్రివేళలోని సన్నివేశాలను గొప్పగా చిత్రీకరించాడు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ నీట్ గా ఉంది. టైటిల్ కి తగినట్టుగానే ఈ సినిమాలో అల్లరి నరేశ్ ఉగ్రత్వం చూడొచ్చు.  ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చే సినిమా అని చెప్పచ్చు. 

ప్లస్ పాయింట్స్: కథ .. కథనం .. నిర్మాణ విలువలు .. అల్లరి నరేశ్ నటన .. కారు యాక్సిడెంట్ ఎపిసోడ్ .. నకిలీ హిజ్రాల ట్రాక్ .. యాక్షన్ .. ఎమోషన్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ.

మైనస్ పాయింట్స్: రక్తపాతం .. హీరోయిన్ ఎంపిక .. ఇంద్రజ లుక్ ..

Trailer

More Reviews