Shah Rukh Khan: షారుఖ్ ఫ్యాన్స్ కు నిరాశ.. జవాన్ విడుదల వాయిదా

 Shah Rukh Khan Atlees Jawan postponed for THIS reason likely to release in August
  • అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం
  • జూన్ 2న విడుదల అవుతుందని గతంలో ప్రకటన
  • పోస్ట్ ప్రొడక్షన్ పనులు కాకపోవడంతో వాయిదా పడ్డ సినిమా
వరుస పరాజయాలకు ముగింపు పలుకుతూ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన పఠాన్‌ చిత్రంతో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు. వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం షారుఖ్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. దాంతో, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న జవాన్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  

అయితే, ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుస్తున్న అభిమానులను చిత్ర యూనిట్ నిరాశపరిచింది. జూన్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. తదుపరి విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు. బాలీవుడ్ వర్గాల సమాచారం మేరకు ఈ యాక్షన్ డ్రామా ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షారుఖ్ ను మళ్లీ వెండితెరపై చూడాలంటే రెండు నెలలు ఆగాల్సిందే. 
 
ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. చిత్రీకరణ పూర్తయినా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం పడుతోంది. అందుకే సినిమా విడుదలను వాయిదా వేసినట్లు చిత్ర బృందం సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘ఈ చిత్రంలో షారుఖ్ కొన్ని భారీ స్టంట్స్ చేశారు. చాలా పోరాట సన్నివేశాలు ఉన్నాయి. వాటికి చక్కటి ట్యూనింగ్ అవసరం. ఏదో హడావుడిగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేయాలని దర్శక నిర్మాతలు అనుకోవడం లేదు. జవాన్ హిందీతో పాటు సౌత్ మార్కెట్ లోనూ భారీ స్థాయిలో విడుదల కానుంది. అందుకే అన్నీ పూర్తి చేసుకొని కాస్త ఆలస్యంగా ఆగస్ట్ రెండు, మూడో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది’ అని వెల్లడించాయి. 

జవాన్ లో షారూఖ్ ఖాన్ రెండు పాత్రలలో కనిపిస్తారని సమాచారం. విజయ్ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో నయనతార బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. సన్యా మల్హోత్రా, ప్రియమణి, సునీల్ గ్రోవర్, యోగి బాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించనుంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నారు.
Shah Rukh Khan
Atlee
Jawan
movie
Bollywood
postponed

More Telugu News