Sharad Pawar: శరద్ పవార్ రాజీనామాపై అజిత్ పవార్ ఏమన్నారంటే..!

  • రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నేతల డిమాండ్
  • ఎన్సీపీ కుటుంబానికి పవార్ సాహెబ్ ఎప్పుడూ అధినేతగానే ఉంటారన్న అజిత్
  • వయస్సు, ఆరోగ్యరీత్యా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని వ్యాఖ్య
Pawar needs two three days to think over his decision to step down ajit pawar

ఎన్సీపీ చీఫ్ పదవి నుంచి వైదొలగాలని శరద్ పవార్ చేసిన ప్రకటనను కార్యకర్తలు జీర్ణించుకోవడం లేదు. తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పార్టీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, పవార్ రాజీనామాపై ఆయన అన్న కుమారుడు అజిత్ పవార్ స్పందించారు. ఎన్సీపీ చీఫ్ పదవి నుండి వైదొలగడంపై పునరాలోచన చేయడానికి శరద్ పవార్ కు రెండు మూడు రోజుల సమయం ఇవ్వాలని కార్యకర్తలతో అన్నారు. అప్పటి వరకు పదవుల్లో ఉన్న ఎన్సీపీ కార్యకర్తలు రాజీనామా చేయకుండా సంయమనం పాటించాలని కోరారు.

"ఆయన (శరద్ పవార్) తన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే మీరు (కార్యకర్తలు) ఆయన కొనసాగాలని కోరుతున్నందున ఈ అంశంపై ఆలోచించేందుకు సీనియర్ పవార్ కు రెండు మూడు రోజుల సమయం కావాలి. కానీ కార్యకర్తలందరూ ఇంటికి వెళ్లిన తర్వాత మాత్రమే ఆయన దాని గురించి ఆలోచిస్తారు' అని అజిత్ పార్టీ కార్యకర్తలకు చెప్పారు.

ఎన్సీపీ కుటుంబానికి పవార్ సాహెబ్ ఎప్పుడూ అధినేతగా ఉంటారని, పార్టీకి అధ్యక్షుడిగా ఎవరు వచ్చినా పవార్ మార్గదర్శకత్వంలోనే పని చేస్తారన్నారు. వయస్సు, ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సమయానుగుణంగా ప్రతి ఒక్కరు నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ అంశంపై సుప్రియా సూలే ఏమీ మాట్లాడవద్దని అన్నగా సూచిస్తున్నానని అన్నారు. కాగా, పవార్ రాజీనామా ప్రకటన సమయంలో ఆ పక్కనే ఉన్న ఎమ్మెల్యే జయంత్ పాటిల్ కన్నీటి పర్యంతమయ్యారు.

More Telugu News