Raghunandan Rao: ఓఆర్ఆర్ లీజు టెండర్లలో గోల్‌మాల్.. కవిత స్నేహితుల కంపెనీకే లీజు: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

  • పదహారు రోజుల పాటు బిడ్‌ను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్న
  • కంపెనీ టెండర్ వేసిన మొత్తం కంటే ప్రభుత్వం ఎక్కువ చెప్పడమేమిటని నిలదీత
  • క్రిసిల్ రిపోర్ట్ ప్రకారం టెండర్లను ఎందుకు పిలవలేదని అడిగిన రఘునందన్
Raghunandan Rao on ORR lease tenders

ఓఆర్ఆర్ ముప్పై ఏళ్ల లీజు టెండర్లలో రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు గోల్ మాల్ కు పాల్పడ్డారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ రోజు హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎక్కువ టెండర్ వేసిన కంపెనీకి లీజు కట్టబెట్టిన ప్రభుత్వం పదహారు రోజుల పాటు బిడ్ ను బహిర్గతం చేయకపోవడంలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ స్నేహితుల కంపెనీలకే ఓఆర్ఆర్ లీజు దక్కిందన్నారు. కంపెనీ టెండర్ వేసిన మొత్తం కంటే ప్రభుత్వం ఎక్కువ చెప్పిందన్నారు.

ఐఆర్‌బీ కంపెనీ రూ.7,272 కోట్లకు మాత్రమే టెండర్ వేసిందని, కానీ టెండర్ ద్వారా రూ.7,380 కోట్లు వస్తోందని ప్రభుత్వం చెప్పిందని, బిడ్ వేసిన మొత్తం కంటే ఐఆర్‌బీ ఎందుకు ఎక్కువ ఇస్తోందని ప్రశ్నించారు. బిడ్ ఓపెన్ తర్వాత బేరమాడి అదే కంపెనీకి అప్పగించారా? అని ప్రశ్నించారు. ఏప్రిల్ 11వ తేదీన ఓపెన్ చేసిన బిడ్ ను ఏప్రిల్ 27 వరకు ఎందుకు వెల్లడించలేదని ప్రశ్నించారు. టెండర్లను ప్రజల ముందు బహిర్గతం చేయాలన్నారు.

ఓఆర్ఆర్ పై అధ్యయనం కోసం క్రిసిల్ సంస్థకు రూ.4 కోట్లు ఇచ్చారని, ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం టెండర్లను ఎందుకు పిలవలేదని నిలదీశారు. కానీ ఆ తర్వాత మజార్స్ అనే మరో కన్సల్టెన్సీ కంపెనీకి రూ.80 లక్షలు చెల్లించి అధ్యయనం చేయించారని, కానీ ఆ కంపెనీ కట్ పేస్టులు చేసిందని ఆరోపించారు.

More Telugu News