Andhra Pradesh: ప్రశ్నించాడని చెంప ఛెళ్లుమనిపించిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు

  • అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ
  • హామీలు నెరవేర్చాలంటూ సొంత పార్టీ నేతల నుంచే డిమాండ్లు
  • స్థానిక సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చిన వ్యక్తిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే
MLA Kannababu slaps one of the locals while on a visit to Poodimadak in Anakapalli district

‘గడపగడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళుతున్న వైసీపీ ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబుకు తాజాగా స్థానికులు, సొంత పార్టీ నేతల నుంచి నిరసన సెగ ఎదురైంది. అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఎమ్మెల్యే కన్నబాబును  సొంత పార్టీ నేతలు తమ సమస్యలను పరిష్కారించాలంటూ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఎమ్మెల్యేను నిలదీశారు. ఈ పరిణామం కన్నబాబుకు ఆగ్రహం తెప్పించింది. నన్నే నిలదీస్తావా అంటూ ఆగ్రహంతో ఊగిపోయిన ఎమ్మెల్యే ఆ వ్యక్తి చెంప ఛెళ్లుమనిపించారు. 

గతంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ సదరు వ్యక్తి నలుగురిలో గట్టిగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లకు వచ్చి స్థానికంగా ఏం జరుగుతోందని అడుగుతున్నారా? అని అతడు నిలదీసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే దురుసుగా ప్రవర్తించినట్టు తెలిసింది. 

కన్నబాబు తీరుపై స్థానికంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి కానీ దురుసుగా ప్రవర్తించడమేంటని అడుగుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వర్గీయులు, స్థానిక వైసీపీ పార్టీ నేతల మధ్య చాలా సేపు వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే గో బ్యాక్ నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. కాగా, గతంలోనూ ఓ మారు ఓ యువకుడిపై ఎమ్మెల్యే కన్నబాబు చేయిచేసుకున్నారన్న ఉదంతం చర్చనీయాంశమైంది.

More Telugu News