Punjab: ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్.. పంజాబ్ లో 9మంది మృత్యువాత

9 dead after gas leak at factory in Ludhiana
  • మరో 11 మందికి అస్వస్థత..
  • రెస్య్కూ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది
  • ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి జనం తరలింపు
  • బాధితులకు అండగా ఉంటామన్న సీఎం మాన్
పంజాబ్ లోని ఓ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటుచేసుకుంది. లూథియానాలోని గియాస్పురా ప్రాంతంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అయింది. దీంతో తొమ్మిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. విషవాయువును పీల్చి మరో 11 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అధికారులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) బృందాలను రంగంలోకి దింపారు. పోలీసులు, వైద్యులు, అంబులెన్స్ లతో పాటు అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా ఫ్యాక్టరీకి చేరుకున్నారు. విషవాయువులు పీల్చి అస్వస్థతకు గురైన వారికి వైద్యులు ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు.

గ్యాస్ లీక్ కావడంతో ఫ్యాక్టరీలోని కార్మికులతో పాటు చుట్టుపక్కల ఉన్న జనాలను కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తరలించాయి. ఈ ప్రమాదంపై లూథియానా సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ స్వాతి తివానా స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ అవుతోందని, పలువురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారని సమాచారం అందిందన్నారు. వెంటనే పోలీసులను, ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి ఫ్యాక్టరీ దగ్గరికి పంపించినట్లు వివరించారు. అయితే, అప్పటికే విషవాయువు పీల్చి తొమ్మిది మంది కార్మికులు చనిపోయారని స్వాతి పేర్కొన్నారు.

ఈ ప్రమాదంపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ స్పందిస్తూ.. గ్యాస్ లీక్ ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. బాధితులకు అండగా ఉంటామని ప్రకటించారు.  అస్వస్థతకు గురైన వారికి అత్యాధునిక చికిత్స అందించాలని, వారు తొందరగా కోలుకునేలా చూడాలని వైద్యులను కోరారు. ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ ఘటనపై ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు.
Punjab
ludhiana
factory
gas leak
9 dead

More Telugu News