Warangal: వరంగల్‌లో దారుణం.. అర్ధరాత్రి ఆటోలో వివాహితపై సామూహిక అత్యాచారం

Auto Drivers Gang Raped Woman in Warangal
  • మహిళ ఆటో ఎక్కగానే స్నేహితులకు ఫోన్ చేసిన డ్రైవర్
  • వారు రాగానే ఆటోను భీమారం వైపు తీసుకెళ్లిన వైనం
  • అనుమానంతో అరిస్తే భయపెట్టిన నిందితులు
  • ఆపై అత్యాచారం చేసి ఆమె చెప్పిన చోట వదిలేసిన వైనం
వరంగల్‌లో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళపై డ్రైవర్ సహా అతడి స్నేహితులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ నయీంనగర్ సమీపంలో నివసించే వివాహిత ఈ నెల 27న పనిపై బయటకు వెళ్లి రాత్రి 12  గంటల సమయంలో తిరిగి ఇంటికి బయలుదేరింది. 

ఈ క్రమంలో కేయూ క్రాస్ వద్ద ఆటోను ఆపి రంగ్‌బార్ వద్ద దింపాలని కోరింది. సరేనని ఆమెను ఎక్కించుకున్న డ్రైవర్ రాకేశ్ తన స్నేహితులైన ఆటో డ్రైవర్లు సనత్, సతీశ్‌కు ఫోన్ చేశాడు. వారొచ్చి ఆటో ఎక్కగానే ఆటోను ముందుకు పోనిచ్చాడు. అయితే, ఆటో ఆమె చెప్పిన చోటుకు కాకుండా భీమారం వైపు వెళ్తుండడంతో అనుమానం వచ్చిన ఆమె ప్రశ్నించి అరవడంతో రాకేశ్ స్నేహితులు ఆమెను బెదిరించారు. 

ఆ తర్వాత ఆటోలోని సౌండ్ బాక్స్ సౌండ్ పెంచి ఆటోలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె చెప్పిన రంగ్‌బార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. ఇంటికెళ్లిన ఆమె విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అందరూ కలిసి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు.
Warangal
Hanamkonda
Auto Driver
Crime News

More Telugu News