Rahmanullah Gurbaz: గుర్బాజ్ పవర్ హిట్టింగ్, రసెల్ మెరుపులు.... కోల్ కతా భారీ స్కోరు

  • కోల్ కతా నైట్ రైడర్స్ తో గుజరాత్ టైటాన్స్ ఢీ
  • ఈడెన్ గార్డెన్స్ లో మ్యాచ్
  • వర్షం వల్ల ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్
  • 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసిన కోల్ కతా
Gurbaz and Russell drives KKR for huge total

వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ భారీ స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ తో సొంత గడ్డ ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న మ్యాచ్ లో కోల్ కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. 

ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ పవర్ హిట్టింగ్ తో మోత పుట్టించాడు. ఈ ఆఫ్ఘనిస్థాన్ బ్యాటర్ కేవలం 39 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. అయితే తన దేశానికే చెందిన నూర్ అహ్మద్ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి బౌండరీ లైన్ వద్ద దొరికిపోయాడు. గుర్బాజ్ స్కోరులో 5 ఫోర్లు, 7 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక చివర్లో ఆండ్రీ రస్సెల్ కాసేపు మెరుపులు మెరిపించాడు. రస్సెల్ 19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సులతో చకచకా 34 పరుగులు చేశాడు. 

కోల్ కతా జట్టులో శార్దూల్ ఠాకూర్ (0), వెంకటేశ్ అయ్యర్ (11) కెప్టెన్ నితీశ్ రాణా (4) విఫలమయ్యారు. సిక్సర్ల వీరుడు రింకూ సింగ్ (19) క్రీజులో కుదురుకుంటున్న సమయంలో అవుటై నిరాశ పరిచాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ 3, జాషువా లిటిల్ 2, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీశారు. 

ఇక 180 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 10 పరుగులు చేసి రస్సెల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో మరో ఓపెనర్ శుభ్ మాన్ గిల్ 35 పరుగులతోనూ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 5 పరుగులతోనూ ఆడుతున్నారు. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 84 బంతుల్లో 128 పరుగులు చేయాలి.

More Telugu News