Rains: ఐకేపీ సెంటర్లలో వర్షపు నీళ్లలో ధాన్యం కుప్పలు

Farmers Suffers Unseasonal Rains Damage Crops in Telangana
  • అకాల వర్షాలతో అన్నదాత విలవిల
  • వారంలోనే రెండుసార్లు కురిసిన వర్షం
  • వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలు 
  • కొనుగోళ్లలో జాప్యం వల్లే నష్టపోయామంటున్న రైతులు
  • మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
తెలంగాణలో అకాల వర్షాల వల్ల అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన పంటలు నేలరాలగా.. ఐకేపీ సెంటర్లకు చేర్చిన ధాన్యం వర్షపు నీటిలో తడిసి ముద్దయింది. వడగండ్ల వానతో చేతికి అందివచ్చిన పంట నేలపాలైందని రైతులు కన్నీటిపర్యంతం అవుతున్నారు. రాష్ట్రంలోని పలు ఐకేపీ సెంటర్లలో ధాన్యం కుప్పలు నీట మునిగాయి. వరి, మొక్కజొన్న పంటలు నీటి పాలయ్యాయి. వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట పట్టణాల్లోని మార్కెట్ యార్డుల్లో ధాన్యం తడిసి ముద్దైంది.

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వల్లే నష్టపోయామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈదురు గాలులకు కాయలు నేల‌రాలడంతో మామిడి రైతులు తీవ్రంగా నష్ట పోయారు. పలు జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట అకాల వర్షాలతో నేలమట్టమైంది. దీంతో కిలో ధాన్యం కూడా చేతికి అందే పరిస్థితి లేదని రైతులు కంటత‌డి పెడుతున్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

వర్షాలు ఇంకో రెండు రోజులు..
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. విదర్భ నుంచి కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం వల్ల తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Rains
unseason
crops damage
Telangana
paddy farmens

More Telugu News