Neeraj Chopra: న్యాయం కోసం రెజ్ల‌ర్లు చేస్తున్న ధ‌ర్నా నన్ను క‌లిచివేస్తోంది: ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా

  • రెజ్ల‌ర్ల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌న్న నీరజ్ చోప్రా
  • చాలా పార‌ద‌ర్శ‌కంగా, నిష్పాక్షికంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలని విజ్ఞప్తి 
  • దేశం త‌ర‌ఫున పోటీ ప‌డేందుకు అథ్లెట్లు ఎంతో కృషి చేశారని వ్యాఖ్య 
Neeraj Chopras response On Wrestlers MeToo Protest

భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ంటూ రెజ్లర్లు ధ‌ర్నా చేస్తున్న విష‌యం తెలిసిందే. మ‌హిళా అథ్లెట్ల‌తో బ్రిజ్ భూష‌ణ్ ప్ర‌వ‌ర్తన స‌రిగా లేద‌ంటూ వారు కొన్ని రోజులుగా నిరసనలు తెలుపుతున్నారు. వీరికి ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయ‌ర్ నీర‌జ్ చోప్రా మద్దతు తెలిపాడు.

ఈ రోజు ఉదయం ట్విట్టర్ లో నీరజ్ చోప్రా ఓ పోస్ట్ పెట్టాడు. రెజ్ల‌ర్ల స‌మ‌స్య ప‌రిష్కారం కోసం అధికారులు త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరాడు. న్యాయం కోసం రెజ్ల‌ర్లు వీధుల్లో ధ‌ర్నా చేయ‌డం త‌నను క‌లిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.

‘‘దేశం త‌ర‌ఫున పోటీ ప‌డేందుకు అథ్లెట్లు ఎంతో కృషి చేశారు. దేశానికి గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు. ప్ర‌తి ఒక్క పౌరుడి స‌మ‌గ్ర‌త‌ను, మ‌ర్యాదను కాపాడే బాధ్య‌త మ‌న‌దే. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు ఇక ఎప్పుడూ జ‌ర‌గ‌కూడ‌దు. ఇది చాలా సున్నిత‌మైన అంశ‌ం. చాలా పార‌ద‌ర్శ‌కంగా, నిష్పాక్షికంగా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాలి’’ అని కోరాడు. అథ్లెట్ల‌కు న్యాయం జ‌రిగేలా అధికారులు త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని విజ్ఞప్తి చేశాడు.

వినోశ్ ఫోగ‌ట్‌, సాక్షీ మాలిక్‌, భ‌జ‌రంగ్ పూనియాతో పాటు అనేక మంది టాప్ రెజ్ల‌ర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. భార‌త రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడు బ్రిజ్ భూష‌ణ్‌పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవ‌ల అథ్లెట్ల‌కు మ‌ద్ద‌తుగా ఒలింపిక్ మెడ‌లిస్టు అభిన‌వ్ బింద్రా కూడా ట్వీట్ చేశారు.

More Telugu News