AR Rahman: తమిళ్ లో మాట్లాడు.. హిందీలో కాదు.. భార్యను టీజ్ చేసిన ఏఆర్ రెహ్మాన్

Speak In Tamil Not Hindi AR Rahman Tells Wife At Event
  • ఇటీవల చెన్నైలో జరిగిన ‘వికటన్‌’ అవార్డుల ప్రదానోత్సవం
  • ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికైన రెహ్మాన్
  • భార్యతో కలిసి అవార్డు తీసుకునేందుకు వెళ్లిన మ్యూజిక్ మ్యాస్ట్రో
  • హిందీలో మాట్లాడొద్దని చమత్కారం.. ఇంగ్లీష్ లో మాట్లాడిన రెహ్మాన్ భార్య సైరా బాను
ఇటీవల చెన్నైలో ‘వికటన్‌’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఇందులో భాగంగా ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును ఏఆర్ రెహ్మాన్‌ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తనతోపాటు వచ్చిన తన భార్య సైరా బానును రెహ్మాన్ టీజ్ చేశారు. 

ఉత్తమ సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ పేరును ప్రకటించగా.. అవార్డును అందుకునేందుకు రెహ్మాన్, ఆయన భార్య సైరా వేదికపైకి వచ్చారు. అవార్డు అందుకున్న తర్వాత రెహ్మాన్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా నా ఇంటర్వ్యూలను మళ్లీ చూడను. కానీ ఈమె మాత్రం పదేపదే చూస్తుంటారు. తనకు నా వాయిస్ అంటే చాలా ఇష్టం’’ అని అన్నారు.

దీంతో సైరా బానును మాట్లాడాల్సిందిగా హోస్ట్ అడిగారు. ఆమె మైక్‌ అందుకుని మాట్లాడేందుకు సిద్ధమవుతుండగా రెహ్మాన్‌ జోక్యం చేసుకున్నారు. ‘‘హిందీలో వద్దు.. తమిళంలో మాట్లాడు ప్లీజ్‌’’ అంటూ కోరారు. దీంతో ‘మై గాడ్’ అంటూ సైరా రియాక్షన్ ఇచ్చారు. 

హిందీ, తమిళ్ లో కాకుండా మధ్యేమార్గంగా ఇంగ్లీషులో మాట్లాడారు. ‘‘క్షమించాలి.. నాకు తమిళం స్పష్టంగా రాదు. అందుకే ఇంగ్లీషులో మాట్లాడుతాను. నేను చాలా సంతోషంగా ఉన్నాను. రెహ్మాన్‌ వాయిస్‌ అంటే ఎంతో ఇష్టం నాకు. ఆ వాయిస్ తో నేను ప్రేమలో పడిపోయాను. ఇంతకన్నా ఏం చెప్పగలను’’ అని అన్నారు.

‘రోజా’ సినిమాతో సంగీత దర్శకుడిగా కెరియర్ ప్రారంభించిన ఏఆర్ రెహ్మాన్.. ఎన్నో చిత్రాలకు అద్భుత గీతాలను అందించారు. స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాలోని ‘జైహో’ పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 1995లో సైరా బానును పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఖతిజ, రహీమా, అమీన్ ఉన్నారు.
AR Rahman
vikatan awards
Saira Banu
Speak In Tamil Not Hindi

More Telugu News