Houseplants: ఇంట్లో మొక్కలు పెంచితే.. బోలెడన్ని ప్రయోజనాలు

Did You Know Of These 5 Surprising Health Benefits Of Houseplants
  • గాలిని శుభ్రం చేసే శక్తి మొక్కలకు ఉంది
  • వీటి నుంచి అదే పనిగా స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల
  • ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం
  • ఇంటి మొక్కలతో నాణ్యమైన నిద్ర, ఆరోగ్యం
కొందరు ఇంట్లో కొంచెం ఖాళీ స్థలం ఉన్నా దాన్ని మొక్కలతో నింపేస్తారు. పూల కుండీల్లో తమకు నచ్చిన మొక్కలను పెంచుకుంటూ, ప్రాణంగా చూసుకుంటారు. మొక్కలపై, పర్యావరణంపై ప్రేమతోనే అనుకోకండి. మొక్కలను పెంచడం వల్ల అదనంగా మనకూ  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక అంశం తెగ ట్రెండింగ్ అయింది. కూలర్ లో నీళ్లు పోస్తున్న ఫొటోను పెట్టి.. ‘మొక్కలకు నీళ్లు పోస్తే ఈ అవస్థ తప్పేదిగా’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇది చాలా మందిని ఆలోచింపచేసింది. ఇందులో నిజంగా ఎంతో అర్థం ఉండడంతో తెగ షేర్ కూడా అయింది. అవును నిజమే, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటికి నీళ్లు పోసి, అవి చెట్లుగా మారితే బతికి ఉన్నంత కాలం అవి మనకు నీడను ఇవ్వడమే కాదు. ఎంతో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. వేడి నుంచి ఉపశమనాన్ని, పర్యావరణ కాలుష్యం నుంచి రక్షణనిచ్చే చెట్లకు ప్రాధాన్యం ఇవ్వడం చాలా అవసరం.

వాయు నాణ్యత
ఇంట్లో ఎయిర్ ప్యూరిఫయర్ అవసరం నేడు ఎంతో ఉంది. దీనికి కారణం వాయు, పారిశ్రామిక కాలుష్యం అధికం కావడమే. ఇంట్లో ఒక ప్యూరిఫయర్ ఉంటే ఎంత మేలు చేస్తుందో తెలియదు కానీ, ఒక్క చెట్టు ఉంటే అంతకంటే ఎక్కువ మేలు చేస్తుందని చెప్పొచ్చు. మొక్కలు సహజంగానే గాలిని ఫిల్టర్ చేసే సాధనాలు. గాల్లోంచి హాని కారకాలను తొలగిస్తాయి. ఇంట్లోని కుండీల్లో పెంచుకునే స్పైడర్ ప్లాంట్స్, పీస్ లిల్లీస్ తదితర మొక్కలు హానికారక టాక్సిన్లను తొలగిస్తాయి. ఇంట్లో గాలి నాణ్యతను పెంచుతాయి.

ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం
ఇంట్లో మొక్కలతో మరో ప్రయోజనం మనలో ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళన కూడా ఉపశమిస్తుంది. ఎందుకంటే మొక్కల నుంచి స్వచ్ఛమైన ఆక్సిజన్ విడుదల అవుతుంది. అది మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. మొక్కలు చుట్టూ ఉంటే మరింత సమర్థవంతంగా పనిచేస్తారని, జ్ఞాపకశక్తికి చురుగ్గా మారుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మెదడుపై మొక్కలు చూపించే సానుకుల ఫలితాలే దీనికి కారణం.

వ్యాధి నిరోధక శక్తి
ఇంట్లో పెంచుకునే మొక్కలతో వ్యాధి నిరోధక శక్తి బలపడుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. మొక్కలు ఫైటోసైడ్స్ ను విడుదల చేస్తాయి. బ్యాక్టీరియా, వైరస్ పై పోరాడడంలో సాయపడే సహజ రసాయనం ఫైటోసైడ్స్. 

నాణ్యమైన నిద్ర
మొక్కలు మన నిద్ర నాణ్యతను కూడా పెంచుతాయి. ఎందుకంటే మొక్కల నుంచి మనకు చక్కని ఆక్సిజన్ అందడం వల్ల నిద్ర నాణ్యత మెరుగు పడుతుంది. ఒత్తిళ్లు కూడా తగ్గుతాయి. కనుక మంచి నిద్ర సాధ్యపడుతుంది.
Houseplants
plants
house
health
benefits

More Telugu News