HMDA: హైదరాబాద్ లో హెచ్ఎండీఏ ప్లాట్ల వేలం.. ధర ఎంతంటే!

HMDA Issued Notification For Sale Of Land Again in Bachupally Medipally
  • బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల్లిలో 85 ప్లాట్ల అమ్మకం
  • వచ్చే నెల 22 నుంచి 25 వరకు వేలం వేయనున్న హెచ్ఎండీఏ
  • మార్చిలో తొలి విడత వేలానికి మంచి స్పందన లభించిందన్న అధికారులు 
హైదరాబాద్ శివారులోని బాచుపల్లి, మేడిపల్లిలోని ప్రభుత్వ ప్లాట్లను హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అమ్మకానికి పెట్టింది. ప్రభుత్వ స్థలాన్ని అభివృద్ధి చేసి ప్లాట్లుగా మలిచిన హెచ్ఎండీఏ.. వాటి అమ్మకానికి సిద్ధమైంది. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్లాట్లను వచ్చే నెల 22 నుంచి 25 వరకు వేలం వేయనున్నట్లు నోటిఫికేషన్ లో వెల్లడించింది.

బాచుపల్లిలో 133 ప్లాట్లు, మేడిపల్లిలో 85 ప్లాట్లను వేలం వేయనున్నట్లు హెచ్ఎండీఏ వెల్లడించింది. నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని బాచుపల్లిలో 27 ఎకరాలు, మేడిపల్లిలో 55 ఎకరాల ప్రభుత్వ స్థలంలో హెచ్‌ఎండీఏ భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసింది. తొలి విడతగా మార్చిలో కొన్ని ప్లాట్లను విక్రయానికి పెట్టగా నగరవాసుల నుంచి మంచి స్పందన లభించిందని అధికారులు తెలిపారు. దీంతో ప్రస్తుతం రెండో విడత ప్లాట్లను వేలం వేస్తున్నట్లు వివరించారు.

హెచ్‌ఎండీఏ నోటిఫికేషన్‌ ప్రకారం.. బాచుపల్లిలో చదరపు గజానికి రూ.25 వేలు, మేడిపల్లిలో చదరపు గజానికి రూ.32 వేలు చొప్పున ధరలు నిర్ణయించింది. కనీస బిడ్‌ పెంపుదల చదరపు గజానికి రూ.500 చొప్పున ఉండాలని సూచించింది. ఈ వేలానికి సంబంధించి మరింత సమాచారం కోసం హెచ్‌ఎండీఏ వెబ్‌సైట్‌, ఎంఎస్‌టీసీ ఈ-కామర్స్‌, ఎంఎస్‌టీసీ ఇండియా వెబ్‌సైట్లను సందర్శించాలని తెలిపింది. లేఅవుట్‌ల సందర్శన, సందేహాల నివృత్తి కోసం 7396345623, 9154843213 నెంబర్లలో సంప్రదించాలని హెచ్ఎండీఏ అధికారులు పేర్కొన్నారు.
HMDA
plots for sale
bachupalli
medipalli

More Telugu News