Supreme Court: తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  • గవర్నర్లు వీలైనంత త్వరగా బిల్లుల పైన నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టు వ్యాఖ్య
  • రాజ్యాంగం ప్రకారమే గవర్నర్లు నడుచుకోవాలని చెప్పిన న్యాయస్థానం
  • కీలక ఆదేశాలు ఇస్తూ... కేసును ముగిస్తున్నట్లు చెప్పిన ధర్మాసనం
Supreme Court comments on pending bills with governor

తెలంగాణలో గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులపై సుప్రీం కోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. పెండింగ్ బిల్లుల కేసుకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం విచారణను ముగించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గవర్నర్లు వీలైనంత త్వరగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నది. రాజ్యాంగం ప్రకారమే గవర్నర్లు నడుచుకోవాలని సూచించింది. అయితే తమ వద్ద ఏ బిల్లులు కూడా పెండింగులో లేవని గవర్నర్ తరఫు లాయర్ సుప్రీం కోర్టుకు తెలిపారు. అయితే రెండు బిల్లులకు సంబంధించి మాత్రమే తాము ప్రభుత్వ వివరణ కోరినట్లు కోర్టుకు స్పష్టం చేశారు.

ప్రజాప్రతినిధులు గవర్నర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. బిల్లులను తిప్పి పంపించాలంటే వీలైనంత వెంటనే పంపించవచ్చునని, కానీ పెండింగులో పెట్టడం సరికాదని కోర్టుకు విన్నవించుకున్నారు.

ఇరువైపులా వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం బిల్లులను వీలైనంత త్వరగా క్లియర్‌ చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం పెండింగ్‌లో బిల్లులు లేనందున కేసును ముగిస్తున్నట్లు సుప్రీం కోర్టు తెలిపింది. 

గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులను గవర్నర్‌ పెండింగ్‌లో పెట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విషయంలో కేంద్రం స్పందన కోరిన అత్యున్నత న్యాయస్థానం.. గవర్నర్‌కు నోటీసులు జారీ చేస్తామని చెప్పింది. అయితే, సమస్య ఏంటో తెలుసుకుంటామని కోర్టుకు తెలిపింది కేంద్రం. 

ఈ అంశంపై మరోసారి విచారణ జరగగా... ఈ నెల 9న గవర్నర్‌ కార్యాలయం నుంచి ఓ నివేదిక కోర్టుకు అందిందని, దానిని సీజేఐ రికార్డు చేసినట్లు పేర్కొన్నారు. మూడు బిల్లులకు ఆమోదం తెలిపారని, కొన్ని బిల్లులపై ప్రభుత్వాన్ని గవర్నర్‌ వివరణ కోరారని, అదే విషయాన్ని గవర్నర్‌ కార్యాలయం నివేదికలో పేర్కొన్నట్లు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఆ తర్వాత ధర్మాసనం పెండింగ్‌ బిల్లుల విషయంపై విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ రోజు మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బిల్లులను ఎప్పటికప్పుడు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ కేసును ముగిస్తున్నట్లు పేర్కొంది.

More Telugu News