Russia: సొంత నగరంపైనే రష్యా బాంబు దాడి.. వీడియో ఇదిగో!

  • బెల్గరోడ్ పై బాంబును జారవిడిచిన రష్యా యుద్ధ విమానం
  • పేలుడు తీవ్రతకు రోడ్డుపై 20 అడుగుల మేర ఏర్పడిన గుంత
  • అపార్ట్ మెంట్ ముందు భారీ విధ్వంసం.. పౌరులను తరలించిన ఆర్మీ
Russian warplane bomb attack on its own city

ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ఆర్మీ బాంబులు, మిసైళ్లతో విరుచుకుపడుతోంది. వైమానిక దాడులతో ఉక్రెయిన్ నగరాలను నేలమట్టం  చేస్తోంది. ఇందులో భాగంగా గురువారం రాత్రి దాడికి బయలుదేరిన రష్యా యుద్ధవిమానం పైలట్ ఒకరు పొరపాటు చేశాడు. సరిహద్దుల్లోని తమ నగరంపైనే బాంబును జారవిడిచాడు. ఉక్రెయిన్ నగరమని పొరబడి బెల్గరోడ్ పై సుమారు 500 కిలోల బాంబుతో దాడి చేశాడు. దీంతో ఉక్రెయిన్ సరిహద్దుకు దాదాపు 40 కిలోమీటర్ల దూరంలోని బెల్గరోడ్ లో సంచలనం రేగింది. తొలుత ఈ దాడి ఉక్రెయిన్ పనేనని భావించిన మిలటరీ అధికారులు.. తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడి చేస్తామని ప్రకటించారు.

బాంబు దాడితో బెల్గరోడ్ లోని ఓ అపార్ట్ మెంట్ ముందు 20 అడుగుల గుంత ఏర్పడిందని రష్యా అధికారులు తెలిపారు. ముగ్గురు పౌరులు గాయపడ్డారని, అపార్ట్ మెంట్ ముందు పార్క్ చేసిన వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు. అపార్ట్ మెంట్ లోని పౌరులను అక్కడి నుంచి తరలించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఆరా తీసిన రష్యన్ ఆర్మీకి అసలు విషయం తెలిసింది. బాంబు దాడి శత్రువు పని కాదని, పొరపాటున తమ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది చేసిందేనని బయటపడింది. దీంతో రక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.

బెల్గరోడ్ పై దాడి పొరపాటున జరిగిందని, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఎస్ యూ 34 యుద్ధ విమానం ఈ బాంబింగ్ చేసిందని అందులో వివరించింది. బాంబు దాడికి సంబంధించిన మిగతా వివరాలను రక్షణ శాఖ వెల్లడించకపోయినా పేలుడు తీవ్రతను బట్టి సుమారు 500 కిలోల శక్తిమంతమైన బాంబును దాడికి ఉపయోగించి ఉంటారని మిలటరీ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News