Sumitra Pampana: బుల్లితెర నటి సుమిత్ర ఇంట్లో భారీ చోరీ.. 1.2 కేజీల బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లిన దొంగలు!

Famous TV actress Sumitra Pampanas house burgled
  • పంజాగుట్ట పరిధిలోని శ్రీనగర్ కాలనీలో నివసిస్తున్న సుమిత్ర
  • ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లిన టీవీ నటి
  • అదే రోజు అర్ధరాత్రి ఆమె ఫ్లాట్‌లోకి చొరబడిన దొంగలు
  • ఇద్దరు వ్యక్తులు చోరీకి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు
హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో నివసించే టీవీ నటి సుమిత్ర పంపన ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు వెండి వస్తువులను దోచుకెళ్లారు. పంజాగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనగర్ కాలనీలోని క్యాప్రీ టవర్స్ ఫ్లాట్ నంబరు 501లో సుమిత్ర ఉంటున్నారు. ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లిన ఆమె ఫ్లాట్ తాళాలను అదే అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న సోదరుడు విజయ్ కుమార్‌కు ఇచ్చారు. 

అదే రోజు అర్ధరాత్రి తాళాలు పగలగొట్టి ఆమె ఇంట్లోకి చొరబడిన దొంగలు 1.2 కిలోల బంగారు, వజ్రాభరణాలతోపాటు 293 గ్రాముల వెండి వస్తువులను ఎత్తుకెళ్లారు. ఆ తర్వాతి రోజు ఉదయం దొంగలు పడిన విషయాన్ని గుర్తించిన సుమిత్ర సోదరుడు విజయ్ కుమార్ ఢిల్లీలో ఉన్న ఆమెకు సమాచారం అందించారు. 

బుధవారం హైదరాబాద్ చేరుకున్న సుమిత్ర పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఇద్దరు వ్యక్తులు ఈ చోరీకి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు.
Sumitra Pampana
TV Actress
Hyderabad

More Telugu News