Mohammed Siraj: నిప్పులు చెరిగిన 'మియా'... పంజాబ్ కింగ్స్ ను ఓడించిన బెంగళూరు

  • మొహాలీలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
  • 24 పరుగులతో విజయాన్నందుకున్న ఆర్సీబీ
  • 4 వికెట్లు పడగొట్టిన మహ్మద్ సిరాజ్
  • 175 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ 150 ఆలౌట్
Siraj scalps four as RCB beat Punjab Kings by 24 runs

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బౌలింగ్ తో తన జట్టుకు విజయాన్నందించాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

'మియా' 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. తొలుత ఓపెనర్ అధర్వ తైదే (4)ను ఎల్బీడబ్ల్యూ చేసిన సిరాజ్... ఆ తర్వాత ప్రమాదకర లియామ్ లివింగ్ స్టోన్ (2) ను కూడా అదే రీతిలో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తన చివరి స్పెల్ లో హర్ ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్ ల వికెట్లను కూడా సిరాజ్ తన ఖాతాలో వేసుకున్నాడు. సిరాజ్ తన యార్కర్లు, పేస్ తో పంజాబ్ కింగ్స్ ను బెంబేలెత్తించాడు. 

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ 84, కోహ్లీ 59 పరుగులు చేశారు. అనంతరం, 175 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ 18.2 ఓవర్లలో 150 పరుగులకే ఆలౌట్ అయింది. 

పంజాబ్  ఓపెనర్ ప్రభ్ సిమ్రన్ సింగ్ 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 46 పరుగులు చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ జితేశ్ శర్మ 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో పోరాడాడు. ఇతర బ్యాట్స్ మన్ నుంచి అతడికి సహకారం అందకపోవడంతో పంజాబ్ ఓటమిపాలైంది. జితేశ్ శర్మ చివరి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. 

కెప్టెన్ శామ్ కరన్ (10) రనౌట్ రూపంలో వెనుదిరగడం పంజాబ్ అవకాశాలను దెబ్బతీసింది. మరో హార్డ్ హిట్టర్ షారుఖ్ కాన్ వచ్చీ రావడంతోనే ఓ సిక్స్ బాదినా, అదే ఊపు కంటిన్యూ చేయలేక 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ 4, హసరంగ 2, వేన్ పార్నెల్ 1, హర్షల్ పటేల్ 1 వికెట్ తీశారు.

More Telugu News