Sunil Gavaskar: నాకే గనక అవకాశం వస్తే.. సీఎస్ కేలో ఆడతా: సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Sunil Gavaskar Picks 3 Legends Who Would Have Excelled In IPL
  • స్టార్ స్పోర్ట్స్ చానల్ ‘ప్రశ్నలు, జవాబుల సెషన్’లో పాల్గొన్న గవాస్కర్
  • ఒకప్పటి తన జట్టులో ఐపీఎల్‌కు ఫిట్‌ అయ్యే ముగ్గురిని ఎంచుకున్న లిటిల్ మాస్టర్
  • ఆల్ రౌండర్ గా కపిల్ దేవ్‌, బ్యాటర్‌గా సందీప్ పాటిల్‌, బౌలర్‌గా చంద్రశేఖర్‌ సరిపోతారని వెల్లడి
  • చాన్స్ వస్తే ముంబై లేదా చెన్నై టీమ్స్ లో ఆడతానని వ్యాఖ్య
సునీల్ గవాస్కర్.. ఒకప్పుడు పరుగుల వరద పారించిన దిగ్గజ ఆటగాడు. ప్లేయర్ గా దశాబ్దాల కిందటే రిటైరైన ఈ లిటిల్ మాస్టర్.. ఇప్పటికీ కామెంటేటర్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ లో కామెంటేటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

స్టార్ స్పోర్ట్స్ చానల్ నిర్వహించిన ప్రశ్నలు, జవాబుల సెషన్ లో గవాస్కర్ పాల్గొన్నారు. ఒకవేళ తన కాలంలోని ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడితే.. ఎవరు అత్యంత విజయవంతమై ఉండేవారనే ప్రశ్నకు బదులిచ్చారు. ముగ్గురు దిగ్గజ ప్లేయర్ల గురించి వెల్లడించారు.

తన జట్టులో ఐపీఎల్‌కు ఫిట్‌ అయ్యే వారిని ఎంపిక చేసుకోమని అడగ్గా.. ఆల్ రౌండర్ గా కపిల్ దేవ్‌, బ్యాటర్‌గా సందీప్ పాటిల్‌, బౌలర్‌గా బీఎస్ చంద్రశేఖర్‌ని ఎంచుకున్నారు. ‘‘బ్యాట్స్ మన్ గా సందీప్ పాటిల్ ను ఎంచుకుంటాను. నేను ఎంచుకోవడానికి ఒకేఒక ఆల్ రౌండర్ ఉన్నాడు. అతడే కపిల్ దేవ్. ఇక బౌలర్ గా బీఎస్ చంద్రశేఖర్ ను ఎంపిక చేసుకుంటా. ఎందుకంటే చంద్రశేఖర్ బౌలింగ్ యాక్షన్ టెస్టులకు మాత్రమే కాదు.. వన్డేలు, టీ20లకు కూడా సరిపోతుంది’’ అని వివరించారు.  

ఒకవేళ అవకాశం వస్తే ఏ టీమ్ తరఫున ఆడుతారు? అని ప్రశ్నించగా.. ‘‘నా ఫస్ట్ చాయిస్ ముంబై ఇండియన్స్. లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడతా. చెన్నై ఎందుకంటే.. నాకు రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది.. చెన్నై టీమ్ ఓనర్లు క్రికెట్ ను ప్రోత్సహిస్తారు. క్రికెట్ కోసం ఎంతో చేశారు. రెండో కారణం.. మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చోవచ్చు. అతను టీమ్‌ని ఎలా కెప్టెన్సీ చేస్తాడో తెలుసుకోవచ్చు. అతను ఫీల్డ్‌లో ఉన్నట్టే డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా కూల్‌గా, కామ్‌గా... ప్రశాంతంగానే ఉంటాడా? ఏమో.. డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్తే ఆ విషయాలు తెలుసుకోవచ్చు. అందుకే సీఎస్‌కే తరపున ఆడాలనుకుంటున్నా’’ అని గవాస్కర్ చెప్పుకొచ్చారు.
Sunil Gavaskar
IPL 2023
Kapil Dev
Mumbai
Chennai
MS Dhoni

More Telugu News