Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల క్రికెట్ కిట్ల చోరీ

Theft in Delhi Capitals camp amid IPL 2023 bats of David Warner and Co worth Rs 16 lakh go missing
  • బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్న తర్వాత కనిపించని వైనం
  • బ్యాట్లు, ప్యాడ్లు, గ్లోవ్ లు ఇతర కిట్లు లేవని గుర్తించిన ఆటగాళ్లు
  • వీటి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా
ఐపీఎల్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ కు ఈ సీజన్ లో టైమ్ అనుకూలంగా లేనట్టుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ వరుస ఓటములు చూసిన ఈ జట్టుకు తాజాగా ఓ చేదు పరిణామం ఎదురైంది. చివరిగా ఈ నెల 15న బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ చేతిలో ఈ జట్టు పరాజయం పాలైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్న అనంతరం లగేజీ బ్యాగులను చూడగా.. కొందరి బ్యాట్లు, ప్యాడ్లు, ఇతర కిట్లు కనిపించకుండా పోయాయి. దీనిపై ఢిల్లీ జట్టు యాజమాన్యం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 

ఇలా కనిపించకుండా పోయిన వాటిల్లో కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ బ్యాట్లు కూడా ఉన్నాయి. చోరీకి గురైన వాటి విలువ రూ.16 లక్షలు ఉంటుందని అంచనా. బెంగళూరు నుంచి ఢిల్లీకి వచ్చిన అనంతరం వీరంతా తమ హోటల్ రూమ్ లకు చేరుకున్నారు. తర్వాత అక్కడికి చేరిన లగేజీ బ్యాగులను పరిశీలించినప్పుడు చోరీ విషయాన్ని గుర్తించారు. 

డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్ కు చెందిన చెరో మూడు బ్యాట్లు పోయాయి. మిచెల్ మార్ష్ కు చెందిన రెండు బ్యాట్లు లేవు. కొందరు ఆటగాళ్ల షూస్, గ్లోవ్ లు కూడా చోరీకి గురయ్యాయి. ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి అని ఢిల్లీ క్యాపిటల్స్ వర్గాలు తెలిపాయి. దీనిపై లాజిస్టిక్స్ కంపెనీకి, పోలీసులకు, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీ సిబ్బందికి ఫిర్యాదు చేసినట్టు చెప్పాయి. విదేశీ ఆటగాళ్లకు సంబంధించి ఒక్కో బ్యాట్ ఖరీదు రూ.లక్ష ఉంటుందని వెల్లడించాయి.
Delhi Capitals
camp
IPL 2023
Rs 16 lakh
bats
kits
missing

More Telugu News