Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధిలో దూసుకుపోయేలా చేస్తాం.. మూలపేట పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో వైఎస్ జగన్

 Srikakulam district will be transform into big city like chennai and mumbai says ap cm jagan
  • రాబోయే రోజుల్లో జిల్లా ముఖచిత్రం మార్చేస్తామన్న ముఖ్యమంత్రి
  • మూలపేట పోర్టు పనులకు భూమిపూజ చేసిన జగన్
  • రెండేళ్లలో పోర్టు పనులు పూర్తిచేస్తామని హామీ
  • పోర్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడి
  • రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ లో 974 కిలోమీటర్ల సముద్రతీరం ఉంటే అందులో 193 కిలోమీటర్ల తీరప్రాంతం శ్రీకాకుళం జిల్లాలోనే ఉంది. అయినా కూడా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందలేదని, దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతూనే ఉందని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయలేదని విమర్శించారు. ఒక పోర్టు కానీ, ఒక ఫిషింగ్ హార్బర్ కానీ ఏర్పాటు చేస్తే శ్రీకాకుళం అభివృద్ధిలో దూసుకుపోతుందని, చెన్నై, ముంబై మాదిరిగా పెద్ద సిటీగా మారుతుందని తెలిసినా గత పాలకులు నిర్లక్ష్యం చేశారని జగన్ మండిపడ్డారు.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని మూలపేటలో పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి జగన్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. మూలపేట పోర్టుతో పాటు రెండు ఫిషింగ్ హార్బర్లు కూడా నిర్మించేందుకు ఇక్కడి నుంచే పనులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధిలో దూసుకుపోయేలా చేయాలని తమ ప్రభుత్వం పట్టుదలతో అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. రాబోయే రోజుల్లో జిల్లా ముఖచిత్రం మార్చేసేలా పలు ప్రాజెక్టులకు ప్రస్తుతం శంకుస్థాపన చేసినట్లు వివరించారు.

మూలపేట ఇక మూలకు ఉన్న పేట కాదని, అభివృద్ధికి మూలస్తంభంగా మారుతుందని అన్నారు. రాబోయే తరానికి ఈ మూలపేట ఓ మహానగరంగా మారుతుందని చెప్పారు. దాదాపు రూ.4,362 కోట్లతో నిర్మిస్తున్న మూలపేట పోర్టును రికార్డు సమయంలో.. అంటే కేవలం 24 నెలల్లో పూర్తిచేస్తామని జగన్ హామీ ఇచ్చారు. పోర్టు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మంది స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని జగన్ వివరించారు. పోర్టు అనుబంధ సంస్థలు కూడా వస్తే మున్ముందు లక్షల సంఖ్యలో స్థానికంగానే యువతకు ఉపాధి లభిస్తుందని ముఖ్యమంత్రి జగన్ వివరించారు.
Andhra Pradesh
YSRCP
YS Jagan
Srikakulam District
mulapeta port
jagan tour

More Telugu News