Neeraja Reddy: కారు టైరు పేలి మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి దుర్మరణం

  • హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా ఘటన
  • టైరు పేలి బోల్తా కొట్టి నుజ్జునుజ్జయిన ఫార్చూనర్ వాహనం
  • నీరజారెడ్డికి తీవ్ర గాయాలు
  • తల, ఇతర శరీరభాగాలు దెబ్బతినడంతో చికిత్స పొందుతూ మృతి
Former MLA Neeraja Reddy dies in a road accident

కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నీరజారెడ్డి ఓ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నీరజారెడ్డి హైదరాబాద్ నుంచి కర్నూలు వస్తుండగా, మార్గమధ్యంలో టైరు పేలి కారు బోల్తా పడింది. బీచుపల్లి వద్ద ఈ ఘటన జరిగింది. 

ప్రమాదం ధాటికి ఆమె ప్రయాణిస్తున్న ఫార్చూనర్ వాహనం పల్టీ కొట్టి నుజ్జునుజ్జయింది. తీవ్ర గాయాలపాలైన నీరజారెడ్డిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నీరజారెడ్డి తల, ఇతర శరీరభాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె చికిత్స పొందుతూ కన్నుమూశారు. 

నీరజారెడ్డి ప్రస్తుతం ఆలూరు బీజేపీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె విజయం సాధించారు. రెండేళ్లకే ఆమె ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ ను వీడారు. 2019లో నీరజారెడ్డి వైసీపీలో చేరారు. అక్కడ ఇమడలేక బీజేపీలో చేరారు. 

కాగా, నీరజారెడ్డి భర్త పాటిల్ శేషిరెడ్డి గతంలోనే మరణించారు. ఆయన పత్తికొండ ఎమ్మెల్యేగా పనిచేశారు.

More Telugu News