Arvind Kejriwal: దేశాన్ని ప్రేమిస్తా.. అవసరమైతే ప్రాణాలైనా ఇస్తా.. : కేజ్రీవాల్

  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ విచారణకు హాజరైన కేజ్రీవాల్
  • అంతకుముందు ఓ వీడియో రిలీజ్ చేసిన ఢిల్లీ సీఎం
  • బీజేపీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోందని మండిపాటు
  • జైలులో పెడతామని పదేపదే బెదిరిస్తున్నారని వ్యాఖ్య
ready to sacrifice my life for the nation kejriwal ahead of appearance before cbi

‘‘నేను దేశాన్ని ప్రేమిస్తా. దేశం కోసం పుట్టాను. దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాను’’ అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈ రోజు సీబీఐ విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. సీబీఐ అడిగే ప్రతి ప్రశ్నకు తాను నిజాయితీగా సమాధానం చెబుతానని, ఎందుకంటే తాను ఏ తప్పు చేయలేదని కేజ్రీవాల్ తెలిపారు. ఎన్ని సార్లు విచారణకు పిలిచినా వస్తానన్నారు. 

‘‘నన్ను సీబీఐ అరెస్ట్ చేస్తుందంటూ బీజేపీ ప్రచారం చేస్తోంది. జైలులో పెడతామని పదేపదే బెదిరిస్తున్నారు. కేజ్రీవాల్ ను అరెస్టు చేయాలని కూడా సీబీఐకి బీజేపీ ఆదేశాలిచ్చి ఉండొచ్చు’’ అని కేజ్రీవాల్ ఆరోపించారు. నేను గత 8 ఏళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపించానని, 30 ఏళ్లలో గుజరాత్ ను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

‘‘బీజేపీ అధికార అహంకారంతో వ్యవహరిస్తోంది. తమ మాట వినకపోతే జైలులో పెడతామనేలా వ్యవహరిస్తోంది. తప్పు చేయకున్నా జైల్లో వేస్తారు. రాజకీయ నాయకులు, మీడియా, ప్రజలు ఇలా ఎవరినైనా సరే ముందు బెదిరిస్తారు. మాట వినకపోతే జైలులో వేస్తారు’’ అని విమర్శలు చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు ఈనెల 16న హాజరు కావాలంటూ కేజ్రీవాల్ కు సీబీఐ ఇటీవల నోటీసులు పంపింది. కేజ్రీవాల్ ను విచారించనున్న నేపథ్యంలో సీబీఐ  సెంట్రల్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్త్ ను పోలీసులు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు సీబీఐ ఆఫీసుకు కేజ్రీవాల్ చేరుకున్నారు. ఈ కేసులో కేజ్రీవాల్ సహచరులు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఇప్పటికే అరెస్టయి జైలులో ఉన్నారు.

More Telugu News