చాటింగ్‌పై దర్యాప్తు కోరే దమ్ముందా కవిత అక్కా: సుఖేశ్
- జైలు నుంచి మరో లేఖ విడుదల చేసిన సుఖేశ్ చంద్రశేఖర్
- కవిత పట్ల గౌరవంతోనే అక్కా అంటున్నాని వెల్లడి
- కేజ్రీవాల్ కు తిహార్ జైలు స్వాగతం పలుకుతుందన్నసుఖేశ్
‘చాట్‌లపై దర్యాప్తు చేయాలని ఈడీ, సీబీఐని అడిగే దమ్ముందా? అవి నిజమా? కాదా? అన్నదాన్ని కోర్టులు, చట్టాలు నిర్ణయిస్తాయి. అందుకే నేను సాక్ష్యాధారాల చట్టం(ఎవిడెన్స్ యాక్ట్)లోని సెక్షన్ 65బీ ప్రకారం అఫిడవిట్ ఇచ్చాను. దయచేసి, ఆ సెక్షన్‌ను ఒక్కసారి చదవండి కవిత అక్కా’ అని సుఖేశ్ ఆ లేఖలో పేర్కొన్నాడు. కవిత, ఆమె అనుచరులు ఎన్ని గిమ్మిక్కులు చేసినా తాను బయటపెట్టిన ఆధారాలు నిరూపితమవుతాయన్నాడు. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌పైనా సుఖేశ్ తన లేఖలో విమర్శలు గుప్పించారు. తిహార్ జైలు ఆయనకు స్వాగతం పలుకుతుందన్నాడు.
కవితకు రూ.15 కోట్లు పంపించిన తర్వాత ఆయనతో జరిగిన ఫేస్‌టైమ్ కాల్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్లను త్వరలో విడుదల చేస్తాను, సిద్ధంగా ఉండాలంటూ లేఖలో పేర్కొన్నాడు. ఇక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించానని, ప్రజలను ఓటు అడిగే ముందు నా మనస్సు, హృదయంలో నుంచి రహస్యాలు, భారాన్ని తొలగించుకొని స్వచ్ఛంగా బయటికి రావాలని భావిస్తున్నానని సుఖేశ్ తెలిపాడు. ఏవో ప్రయోజనాలు ఆశించి కాకుండా స్వయంగా వాటిని బహిర్గతం చేస్తున్నానని తెలిపాడు.