365 Days Of Paid Leave: ఆహా ఏమి అదృష్టం.. ఉద్యోగికి ఏడాదంతా సెలవులు + జీతం కూడా!

Chinese Man Wins 365 Days Of Paid Leave At Companys Lucky Draw
  • ఉద్యోగులకు డిన్న‌ర్ పార్టీ ఇచ్చిన కంపెనీ
  • తర్వాత ఓ ల‌క్కీ డ్రా కూడా ఏర్పాటు
  • గెలిచిన వ్యక్తికి ఏడాదంతా పెయిడ్ లీవ్
  • చైనాలోని షెన్ జెన్ నగరంలో ఘటన 
ఎంత టాలెంట్ ఉన్నా సరే.. ఆవ గింజంత లక్ కూడా ఉండాలంటారు. ఇదిగో ఇతడి అదృష్టం మామూలుగా లేదు. తంతే బూరెల బుట్టలో పడ్డట్టు.. తాను పని చేసే కంపెనీ నుంచి బంపర్ ఆఫర్ గెలుచుకున్నాడు. లక్కీ డ్రాలో 365 రోజుల పెయిడ్ లీవ్ అందుకున్నాడు. చైనాలోని షెన్ జెన్ నగరంలో ఈ ఘటన జరిగింది.

క‌రోనా వ‌ల్ల గ‌త మూడేళ్ల నుంచి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, దాన్నుంచి బ‌య‌ట‌ప‌డేందుకని ఓ కంపెనీ త‌మ ఉద్యోగులకు డిన్న‌ర్ పార్టీ ఇచ్చింది. ఓ ల‌క్కీ డ్రా కూడా నిర్వహించింది. ఆ డ్రాను చెన్ అనే ఉద్యోగి గెలుచుకున్నాడు. ఓ ఏడాది పాటు అతనికి పెయిడ్ లీవ్ ఇస్తున్న‌ట్లు ఆ కంపెనీ చెప్పింది. అంటే ఏడాదంతా ఆఫీసుకు రాకపోయినా, పని చేయకపోయినా అతడికి జీతం మాత్రం వస్తుందన్నమాట. 

పెయిడ్ లీవ్ గెలిచిన వ్య‌క్తికి భారీ చెక్‌ను ప్ర‌జెంట్ చేశారు. ఆ చెక్‌పై ‘365 డేస్ పెయిడ్ లీవ్’ అని రాసి ఉంది. ఉద్యోగుల్లో వ‌ర్క్ ప్రెజ‌ర్ త‌గ్గించేందుకు ఆ కంపెనీ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఇంతా చేసిన ఆ కంపెనీ వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. మరోవైపు ప్రైజ్ గెలిచిన ఉద్యోగి పెయిడ్ లీవ్ వాడుకుంటాడా? లేక డ‌బ్బులు ఎన్‌క్యాష్ చేసుకుంటాడా? అనే దానిపై కంపెనీతో చర్చించనున్నట్లు సమాచారం.

కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. ‘మాకూ ఇలాంటి కంపెనీ ఉంటే బాగుండును’ అని ఒకరు.. ‘ఆ కంపెనీలో నాకు ఓ జాబ్ కావాలి.. వేకెన్సీ ఉందా?’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘బాబూ.. నువ్వు నిజంగా పెయిడ్ లీవ్ తీసుకుంటే.. ఏడాది త‌ర్వాత నీ పోస్టులో ఇంకో వ్య‌క్తి ఉంటాడు చూస్కో మరి’ అంటూ ఇంకో యూజర్ కామెంట్ చేశారు.
365 Days Of Paid Leave
Lucky Draw
Chinese Man

More Telugu News