KL rahul: లక్నో జట్టులో చేరాలనుకున్న పాండ్యా.. గుజరాత్ సారథి ఎలా అయ్యాడు?

  • ఆశిష్ నెహ్రా కాల్ చేసి గుజరాత్ జట్టుకు ఒప్పించారన్న పాండ్యా
  • లేదంటే తాను లక్నో జట్టులో భాగం అయ్యే వాడినని వెల్లడి
  • కేఎల్ రాహుల్ కు తన గురించి బాగా తెలుసన్న గుజరాత్ కెప్టెన్
I got a call from LSG was keen to go there because of KL rahul Then Nehra called me Hardik staggering revelation on GT

ఐపీఎల్ 2022 టైటిల్ ను గుజరాత్ టైటాన్స్ గెలుచుకోగా, ఈ కొత్త జట్టుకు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా నూటికి నూరు మార్కులు సంపాదించాడు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ అయ్యే వరకు అతడిలో నాయకత్వ లక్షణాలను బీసీసీఐ సెలక్టర్లు గుర్తించకపోవడమే విడ్డూరం. ఏదైతేనేమి వచ్చిన సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన హార్దిక్ పాండ్యా.. నిజానికి కొత్త జట్లలో ఒకటైన లక్నో సూపర్ జెయింట్స్ లో చేరదామని అనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా పాండ్యాయే గుజరాత్ టైటాన్స్ పాడ్ కాస్ట్ లో గౌరవ్ కపూర్ తో వెల్లడించాడు.

2022 ఐపీఎల్ సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు కొత్తగా ఏర్పడడం తెలిసిందే. లక్నో జట్టు సారథిగా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేసుకుంది. కేఎల్ రాహుల్ తో ఉన్న సాన్నిహిత్యం వల్ల తాను లక్నో జట్టులోకి వెళదామని అనుకున్నట్టు పాండ్యా వెల్లడించాడు. ‘‘ఇతర ఫ్రాంచైజీల (లక్నో జట్టు) నుంచి కూడా నాకు కాల్స్ వచ్చాయి. నాకు తెలిసిన కేఎల్ రాహుల్ ఆ జట్టును నడిపిస్తున్నాడు. నా గురించి తెలిసిన వ్యక్తితో కలసి ఆడాలనే నేను నిజంగా కోరుకుంటాను. అదే నాకు ముఖ్యం. నన్ను ఎప్పుడూ చూడని వ్యక్తుల కంటే, నా గురించి తెలిసిన వ్యక్తులు భిన్నమైన దృక్కోణాన్ని కలిగి ఉంటారని భావిస్తాను. నాకు తెలిసిన వ్యక్తితో కలసి పనిచేసే అవకాశం లభిస్తే అటు వైపే మొగ్గుతాను.

కానీ, అషు పా (గుజరాత్ జట్టు కోచ్ ఆశిష్ నెహ్రా) నాకు కాల్ చేశారు. ఆ సమయంలో ఐపీఎల్ లో ఇంకా చోటు ఖరారు కాలేదు. ‘నేను కోచ్ గా పనిచేయబోతున్నాను. ఇది ఇంకా ఖరారు కాలేదు. కానీ, నేనే కోచ్ గా ఉంటాను’ అని చెప్పారు. అషు పా అంటే నాకు ఇష్టం. నా గురించి తెలిసిన వ్యక్తుల్లో నెహ్రా కూడా ఒకరు. కాల్ పెట్టేసిన వెంటనే ఆయన మెస్సేజ్ చేశారు. ‘నీకు సమ్మతం అయితే నిన్ను కెప్టెన్ గా ప్రతిపాదిస్తాను’ అని చెప్పినట్టు’’ పాండ్యా వెల్లడించాడు. తనపై పెట్టుకున్న అంచనాలను ఆచరణలో చూపించి పాండ్యా విజయం సాధించాడు.

More Telugu News