Chandrababu: ‘కోడి కత్తి’ డ్రామా అని ఆనాడే చెప్పాను.. గుడివాడలో జగన్‌పై విరుచుకుపడిన చంద్రబాబు

  • గుడివాడలో ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమం
  • కోడికత్తి విషయంలో నాడు తాను చెప్పిందే ఇప్పుడు ఎన్ఐఏ చెప్పిందన్న చంద్రబాబు
  • రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయిందని ఆవేదన
  • 9 నెలల్లో పట్టిసీమ కట్టి నీళ్లందించిన ఘనత టీడీపీదేనన్న బాబు
  • బూతుల ఎమ్మెల్యే రోడ్లు వేయకున్నా కేసినో, క్యాబరే డ్యాన్సులు తెచ్చాడని మండిపాటు
Nara Chandra Babu Fires On YS Jagan In Gudivada

‘ఇదేం ఖర్మ’ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గత రాత్రి గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కోడి కత్తి కేసులో టీడీపీకి సంబంధం ఉందని అప్పట్లో ఆరోపించారని, కానీ జగన్ విశాఖలో ఆడింది డ్రామా అని, కోడి కత్తి అనేది నాటకమని ఆనాడే చెప్పానని అన్నారు. ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కూడా అదే తేల్చిందని చంద్రబాబు అన్నారు. 

కోడి కత్తి కమలహాసన్
ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిశోర్ ఆడించిన నాటకంలో జగన్ కోడి కత్తి కమలహాసన్‌గా మిగిలిపోయారని చంద్రబాబు విమర్శించారు. కోడి కత్తి శీను పనిచేసే రెస్టారెంట్ యజమాని పేరు వెనుక చౌదరి అని పేరు చేర్చి డ్రామా ఆడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరినైనా చంపాలనుకుంటే కోడి కత్తితో దాడి చేస్తారా? అని ప్రశ్నించారు. బాబాయిపై గొడ్డలి వేటు వేశారని, చనిపోయిన ఆయనను మళ్లీ మళ్లీ చంపుతున్నారని అన్నారు.

తుపాకి గురిపెట్టి..
రాష్ట్రంలో తుపాకి గురిపెట్టి ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారికి మళ్లీ రాష్ట్రాన్ని అప్పజెబితే ఆస్తులన్నీ వారికి రాసిచ్చేసి వారి దగ్గరే మళ్లీ కూలి పనులు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దేశంలోని అందరి సీఎంల కంటే జగన్ ఆస్తే ఎక్కువన్నారు. చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు.

మెడలు వంచుతానని ఆయనే వంచేశారు
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా తెస్తానని, కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఇప్పుడు తానే మెడలు వంచేశారని విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్ అయిపోయిందని, పోలవరం అయిపోయిందని, అమరావతిని ముంచేశారని మండిపడ్డారు. 9 నెలల్లోనే పట్టిసీమ కట్టి రైతులకు నీళ్లు అందించిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.

రూ. 510 కోట్ల ఆస్తి ఉన్న పేద సీఎం
ఈ సీఎంకు అమరావతి అంటే పడదని, అందుకనే మూడుముక్కలాట ఆడుతున్నాడని చంద్రబాబు అన్నారు. జగన్ ఈ దేశంలోనే అత్యంత ధనికుడైన సీఎం అని, ఆయన ఆస్తులు రూ. 510 కోట్లు పైనేనని అన్నారు. దేశంలోని మిగిలిన 29 మంది సీఎంల ఆస్తులు కలిపినా రూ. 505 కోట్లే అవుతోందన్నారు. అయినా తాను పేదవాడినని చెప్పుకుంటారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఈ నాలుగేళ్లలో జగన్  రూ. 2 లక్షల కోట్లు బొక్కేస్తే, ఆయన మంత్రులు మరో రూ. 2 లక్షల కోట్లు బొక్కేసారని ఆరోపించారు.
 
తులసి వనంలో గంజాయి మొక్కలా కొడాలి నాని
ఎన్టీఆర్ లాంటి ఎందరో మహనీయులు పుట్టిన చోటు గుడివాడ అని.. అలాంటి చోట గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తులసి వనంలో గంజాయి మొక్కలా మారాడంటూ నిప్పులు చెరిగారు. త్వరలోనే ఈ మొక్కను పీకేద్దామన్నారు. బూతులు మాట్లాడడం గొప్ప విషయమా? అని ప్రశ్నించారు. రాజకీయ భిక్ష పెట్టిన వారిని తిడితే చరిత్ర హీనులవుతారని అన్నారు. ప్రతి ఒక్కరు జెండా పట్టుకుని రోడ్డపైకి వస్తే బూతుల మాజీ మంత్రి రోడ్డుపై తిరగ్గలిగేవాడా? అని హెచ్చరించారు. నియోజకవర్గంలో రోడ్డు వేయలేని ఎమ్మెల్యే కేసినో, క్యాబరే డ్యాన్సులు, పేకాట క్లబ్బులు మాత్రం తెచ్చాడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News