Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి: పవన్ కల్యాణ్

  • స్టీల్ ప్లాంట్ విషయంలో ముందుకు వెళ్లడంలేదన్న కేంద్రం
  • ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరించే ఆలోచన లేదన్న కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్
  • కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించిన పవన్ కల్యాణ్
  • వైసీపీ పాలకులు పరిశ్రమను కాపాడతామని చెప్పలేకపోయారని వెల్లడి
  • కేంద్రమంత్రి ప్రకటన కొత్త ఆశలు రేపుతోందని వివరణ
Pawan Kalyan welcomes union govt decision on Vizag Steel Plant

విశాఖ ఉక్కు పరిశ్రమపై కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే ప్రకటనను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్వాగతించారు. కేంద్రం ప్రకటన ఆశాజనకంగా ఉందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ తెలుగు ప్రజల సెంటిమెంట్ అని వెల్లడించారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాకారమైన విశాఖ ఉక్కు పరిశ్రమ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉండాలని జనసేన పార్టీ కోరుకుంటోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. 

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తారన్న అంశం వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిశామని వెల్లడించారు. జనసేన పక్షాన స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిలిచామని, భారీ బహిరంగ సభ నిర్వహించి రాష్ట్ర పాలకులు అఖిలపక్షాన్ని తీసుకుని కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్లాలని విజ్ఞప్తి చేసినా, వైసీపీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని వెల్లడించారు. 

నాడు, ఢిల్లీలో అమిత్ షాను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ తో తెలుగు ప్రజల భావోద్వేగ అనుబంధాన్ని వివరించామని, బీజేపీ పెద్దలు దీనిపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ పరిశ్రమను ప్రత్యేక దృష్టితో చూడాలని కోరగా, వారి స్పందన ఎంతో ఆశావహంగా అనిపించిందని పవన్ వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటీకరించడం లేదని, దీనిపై ప్రస్తుతం ముందుకెళ్లడం లేదని ఇవాళ కేంద్రమంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే చేసిన ప్రకటన ఆనందం కలిగించిందని పేర్కొన్నారు. 

కొన్నిరోజుల కిందట విశాఖ ఉక్కుపై పొరుగు రాష్ట్రం స్పందించిందని, కానీ దీని వెనుక ఉన్న రాజకీయ ప్రయోజనాలు, నేపథ్యాలపై వైసీపీ పాలకులు విమర్శలు చేస్తున్నారే తప్ప, పరిశ్రమను కాపాడతామనే మాట చెప్పలేకపోయారని జనసేనాని విమర్శించారు. చిత్తశుద్ధి లేని రాష్ట్ర పాలకుల వల్ల విశాఖ ఉక్కు పరిరక్షణ అంశం ముందుకు కదల్లేదని ఆరోపించారు. 

ఈ క్రమంలో కేంద్ర మంత్రి చేసిన ప్రకటన కొత్త ఆశలు రేపుతోందని తెలిపారు. జనసేన పార్టీ తొలి నుంచి ఈ పరిశ్రమను పరిరక్షించాలనే కోరుతోందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)ను బలోపేతం చేయాలని నిర్ణయించిన దృష్ట్యా విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News