Lingusamy: తమిళ సినీ దర్శకుడికి 6 నెలల జైలు శిక్ష

  • 2014లో పీవీపీ సంస్థ నుంచి రూ.కోటికిపైగా రుణం తీసుకున్న లింగుస్వామి
  • గతంలో ఇచ్చిన చెక్ బౌన్స్ .. కోర్టులో కేసు వేసిన పీవీపీ సంస్థ 
  • కింది కోర్టు తీర్పును సమర్థించిన మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు 
Director Lingusamy to serve 6 months in jail in cheque fraud case

తమిళ డైరెక్టర్ లింగుస్వామికి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో ఈ మేరకు తీర్పు చెప్పింది. 2014లో పీవీపీ సంస్థ నుంచి లింగుస్వామి, ఆయన సోదరుడు సుభాష్ చంద్రబోస్‌ రూ. కోటికి పైగా రుణం తీసుకున్నారు. వీరు తిరుపతి బ్రదర్స్ పేరుతో నిర్మాణ సంస్థను నిర్వహిస్తున్నారు. అయితే అప్పు తిరిగి చెల్లించేందుకు సంబంధించి వారు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. దీంతో గతేడాది పీవీపీ సంస్థ వారిపై చెక్ బౌన్స్ కేసు పెట్టింది.

కేసును విచారించిన చెన్నై సైదాపేటలోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. దర్శకుడు లింగుస్వామికి చెక్ ఫ్రాడ్ కేసులో 6 నెలల జైలు శిక్ష విధించింది. గతేడాది ఆగస్టు 22న ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై లింగుస్వామి అప్పీల్‌ దాఖలు చేశారు. తాజాగా విచారణ జరిపిన మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు.. కింది కోర్టు తీర్పును సమర్థించింది. ఈ జడ్జిమెంట్ గురించి ట్విట్టర్‌లో షేర్ చేసిన లింగుస్వామి.. మరోసారి అప్పీలుకు వెళ్తామని వెల్లడించారు.

కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్లలో లింగుస్వామి ఒకరు. ఆయన తీసిన సినిమాల్లో రన్, పందెంకోడి, ఆవారా చిత్రాలు మంచి హిట్లుగా నిలిచాయి. కానీ గతేడాది మొదటిసారిగా రామ్ హీరోగా తెలుగు, తమిళ్‌లో ఆయన ద్విభాషా చిత్రంగా రూపొందించిన ‘వారియర్’ పెద్దగా ఆడలేదు.

More Telugu News