Maheshwar Reddy: కాంగ్రెస్ కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాజీనామా.. కాసేపట్లో నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్న వైనం

Mahesh Reddy resigns to Congress
  • తెలంగాణలో కాంగ్రెస్ కు మరో షాక్
  • ఖర్గేకు రాజీనామా లేఖను పంపిన మహేశ్వర్ రెడ్డి
  • బండి సంజయ్, ఈటలతో కలిసి తరుణ్ చుగ్ నివాసానికి వెళ్లిన మహేశ్వర్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మరో భారీ షాక్ తగిలింది. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపించారు. 

ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తో కలసి ఆయన ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. మరోవైపు, కాసేపటి క్రితం బండి సంజయ్, ఈటలతో కలిసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జీ తరుణ్ ఛుగ్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డికి తరుణ్ చుగ్ శాలువా కప్పి సత్కరించారు. ఈ భేటీ అనంతరం వీరంతా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసానికి వెళ్లనున్నారు. నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.

ఇంకోవైపు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ ఆయనకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి నిన్న షోకాజ్ నోటీసు ఇచ్చారు. గంటలోగా తమకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులో ఆదేశించారు. నోటీసుకు ఆయన సమాధానం ఇవ్వకపోగా... టీపీసీసీనే తనకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో రోజు గడవకముందే ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
Maheshwar Reddy
Congress
Resign
BJP

More Telugu News