tspsc: పుణ్యక్షేత్రాలు తిరిగొచ్చిన పేపర్ లీక్ జంట.. పట్టుబడకుండా ఉండాలని మొక్కులు

TSPSC paper leak case khammam couple visited temples accross india
  • గండం గట్టెక్కించాలంటూ ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు 
  • ఆందోళనతో నిద్రలేని రాత్రులు గడిపిన సాయి లౌకిక్, సుస్మిత
  • చివరకు పట్టుబడి జైలుకు చేరిన ఖమ్మం జంట 
బేరం కుదిరింది, పేపర్ దక్కింది.. ఉద్యోగం ఖరారైనట్లే అనే సమయంలో గ్రూప్ 1 పేపర్ లీక్ విషయం బయటకు రావడం ఆ జంటలో ఆందోళన పెంచింది. నిద్రలేని రాత్రులు, భయాందోళనల మధ్య రోజులు గడిచాయి. అధికారుల విచారణ గ్రూప్ 1 పేపర్ తోనే ఆగిపోవాలని, డీఏవో పేపర్ లీక్ విషయం బయటపడకూడదని దేవుళ్లను మొక్కుకుంది. పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మొక్కుకున్నారు. చివరకు భయపడ్డట్లే అధికారులకు పట్టుబడ్డారు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) పేపర్ కొనుగోలు చేసిన ఖమ్మం జంట సాయి సుస్మిత, సాయి లౌకిక్ విచారణలో వెల్లడించిన వివరాలివి.

సాయి సుస్మిత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా ఆమె భర్త సాయి లౌకిక్ కార్ల వ్యాపారి. తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడంతో సాయి సుస్మిత దరఖాస్తు చేసుకుంది. గతేడాది కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసినా రాంగ్ బబ్లింగ్ కారణంగా ఫలితం ఆగిపోయింది. ఈ విషయంలో పలుమార్లు టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి వెళ్లడంతో పేపర్ లీక్ ప్రధాన నిందితుడు ప్రవీణ్ పరిచయమయ్యాడు. ఈ పరిచయంతోనే డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏవో) పేపర్ ను అమ్మకానికి పెట్టగా.. సాయి లౌకిక్ రూ.6 లక్షలు చెల్లించి పేపర్ ను భార్యకు అందించాడు. ఆ పేపర్ తో సిద్ధమైన సుస్మిత దాదాపు అన్ని ప్రశ్నలకు జవాబులు మార్క్ చేసింది.

డీఏవో పోస్ట్ గ్యారంటీ అని భార్యాభర్తలు సంతోషంతో ఉండగా.. గ్రూప్ 1 పేపర్ లీకేజీ బయటపడింది. దీంతో ఈ దంపతులకు ఆందోళన మొదలైంది. డీఏవో పేపర్ లీక్ విషయం బయటపడకుండా చూడాలంటూ దేవుళ్లకు మొక్కుకున్నారు.. తిరుపతి, షిర్డీ తదితర క్షేత్రాలను సందర్శించారు. అయినా ఉపయోగం లేకుండా పోయింది. దాదాపు 25 రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపాక వాళ్లు భయపడ్డట్లే జరిగింది. డీఏవో పేపర్ లీక్ విషయం బయటపడడం, సాయి లౌకిక్ తన భార్య కోసం పేపర్ కొనుగోలు చేసినట్లు తేలడంతో పోలీసులు ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు.
tspsc
khammam couple
DAO paper leak
temple tour

More Telugu News