Hyderabad: గ్రేటర్ హైదరాబాద్ లో నకిలీ చాక్లెట్ల దందా

Making fake chocolates in Greater Hyderabad
  • ఎంకే స్వీట్స్ పేరుతో రెండేళ్లుగా తయారీ 
  • నగరంలోని బేగంబజార్ లో వ్యాపారులకు పంపిణీ
  • చాక్లెట్లు తయారు చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు
గ్రేటర్ హైదరాబాద్ లో నాసిరకం చాక్లెట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ దందా నిర్వాహకుడు అహ్మద్ తో పాటు చాక్లెట్ తయారీ పరిశ్రమలో పనిచేస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. సులేమాన్‌‌నగర్ కు చెందిన అహ్మద్‌‌(30) రెండేళ్ల క్రితం అదే ప్రాంతంలో ఎంకే స్వీట్స్‌‌ పేరిట చిన్న షెడ్లో పరిశ్రమను ఏర్పాటు చేశాడు. ఇందులో రసాయనాలు, సిట్రిక్ యాసిడ్ కలిపి నాసిరకం చాక్లెట్లు, లాలీపాప్స్, పిప్పరమెంట్లు తయారుచేస్తున్నాడు. వాటిని అందంగా ప్యాక్ చేసి బేగంబజార్ లోని హోల్ సేల్ వ్యాపారులకు అమ్ముతున్నాడు. 

ఈ చాక్లెట్ తయారీ పరిశ్రమలో శుభ్రత అనేదే కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈగలు, దోమలు, పురుగులు పడిన పానకంతోనే చాక్లెట్లు తయారుచేయిస్తున్నాడని వివరించారు. విషయం తెలుసుకున్న రాజేంద్ర నగర్ ఎస్ వో టీ పోలీసులు బుధవారం ఎంకే స్వీట్స్ పరిశ్రమపై దాడులు చేశారు. 350 కిలోల చక్కెర, రసాయనాల బాటిళ్లు, రంగు డబ్బాలు, ఒక డ్రమ్ము గ్లూకోజ్‌‌ లిక్విడ్, సిట్రిక్‌‌ యాసిడ్‌‌ పౌడర్, ఆరెంజ్‌‌ లిక్విడ్‌‌ ప్లేవర్, బెస్ట్‌‌ పాలిష్‌‌ పౌడర్, మిక్సింగ్‌‌ మిషిన్, స్వీట్‌‌ ఆయిల్‌‌ స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు అహ్మద్ తో పాటు ఆరుగురు కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు.
Hyderabad
fake chocolates
suleman nagar
rajendra nagar

More Telugu News