Imran Khan: భారత్‌ లాగా చేద్దామనుకుని ఫెయిలైన పాక్ ..మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్య

  • భారత విదేశాంగ విధానంపై ఇమ్రాన్ ప్రశంసల జల్లు
  • భారత్ రష్యా నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకుంటోందని వెల్లడి
  • ఇండియాలాగా చేద్దామనుకుని పాక్ విఫలమైందని వ్యాఖ్య
Pak tried to import crude oil from russia like india but failed says former pm imran khan

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరోమారు భారత్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. భారత విదేశాంగ విధానాన్ని ఆకాశానికెత్తేశారు. భారత్ లాగా చేద్దామని పాక్ ప్రయత్నించి విఫలమైందని కూడా పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్ చౌకగా ముడిచమురు దిగుమతి విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్ లాగా రష్యా నుంచి చౌకగా చమురును దిగుమతి చేసుకోవాలనుకున్న పాక్ చివరకు విఫలమైంది. అవిశ్వాస తీర్మానంలో నా ప్రభుత్వం ఓడిపోవడంతో చౌకగా చమురు దిగుమతి సాధ్యపడలేదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

ప్రస్తుతం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. డాలర్‌తో పోలిస్తే పాకిస్థానీ కరెన్సీ విలువ అసాధారణ రీతిలో పతనమైంది. ఇక రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష విరమణకు పండ్లు కూడా కొనుక్కోలేని స్థితిలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

పాకిస్థాన్‌ను ఆర్థికకష్టాల నుంచి గట్టెక్కించేందుకు అప్పట్లో ప్రధాని ఇమ్రాన్ రష్యాలో పర్యటించారు. దాదాపు 23 ఏళ్ల తరువాత తొలిసారిగా రష్యాలో ఓ పాక్ ప్రధాని పర్యటిస్తుండటంతో ఇమ్రాన్ టూర్‌కు అమిత ప్రాధాన్యం ఏర్పడింది. అయితే.. రష్యాతో పాక్ ఒప్పందం మాత్రం కుదుర్చుకోలేకపోయింది. ఇక పాక్‌తో దౌత్య సంబంధాలు బలపరుచుకునేందుకు రష్యా సిద్ధంగా ఉందని రష్యా రాయబారి ఈ ఫిబ్రవరిలో వ్యాఖ్యానించారు. బలహీనమైన పాకిస్థాన్ దక్షిణాసియా ప్రాంతానికి క్షేమకరం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News