Mekapati Rajamohan Reddy: నా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పే: మేకపాటి రాజమోహన్ రెడ్డి

Mekapati Rajamohan Reddy talks about his brother Chandrasekhar Reddy
  • ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపు
  • క్రాస్ ఓటింగ్ చేశారంటూ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
  • మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నీచమైన పనికి పాల్పడ్డాడన్న రాజమోహన్ రెడ్డి
  • 2019 తర్వాత మారిపోయాడని వెల్లడి
ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించగా, క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలను వైసీపీ హైకమాండ్ సస్పెండ్ చేయడం తెలిసిందే. అయితే తాము ఎలాంటి క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని నలుగురు ఎమ్మెల్యేలు అంటున్నారు. 

ఈ నేపథ్యంలో, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓటింగ్ చేయడం తప్పేనని అన్నారు. తన మాట వినకుండా చంద్రశేఖర్ రెడ్డి పార్టీకి ద్రోహం చేశారని ఆరోపించారు. చిన్నప్పటి నుంచే అతడి వైఖరి తప్పుగా ఉండేదని, అయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కాస్త బాగానే ఉన్నాడని సోదరుడి గురించి రాజమోహన్ రెడ్డి వివరించారు. 

సోషల్ మీడియాలో తనకంటే చురుగ్గా ఉంటున్నాడని తెలిపారు. అందరినీ అల్లుడూ, అన్నా, తమ్ముడూ అంటూ భుజాలమీద చేతులు వేస్తూ కలుపుగోలుగా ఉండేవాడని వివరించారు. తమ్ముడితో పోల్చితే తాను కొంచెం రిజర్వ్ డ్ గా ఉండే వ్యక్తినని రాజమోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే, 2019 వరకు చంద్రశేఖర్ రెడ్డి బాగానే ఉన్నాడని, కానీ కొంతకాలంగా ఆయన పంచన ఓ దుష్టశక్తి చేరిందని ఆయనతో నీచాతి నీచమైన దరిద్రపు పనులన్నీ చేయిస్తోందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగింది అన్నింటికంటే పరమ నీచమైన పని అని రాజమోహన్ రెడ్డి విమర్శించారు. 

తన తమ్ముడి వద్ద ఉండే వ్యక్తుల ద్వారా తాను వారించే ప్రయత్నం చేశానని, కానీ అతడు తన మాట వినలేదని విచారం వ్యక్తం చేశారు. చేసిన దుర్మార్గపు పనికి గాను ఇవాళ అతడు ఒంటరివాడు అయిపోయాడని, చంద్రశేఖర్ రెడ్డిని పలకరించేవాళ్లు కూడా లేరని అన్నారు. 

ఈ విషయాల పట్ల తాను చింతిస్తున్నానని, ఉదయగిరి ప్రజలకు క్షమాపణలు చెప్పుకుంటున్నానని తెలిపారు. చంద్రశేఖర్ రెడ్డి తీరు నచ్చక ఆయనతో మూడేళ్లుగా తాను మాట్లాడడం లేదని కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ఉదయగిరిలో వైసీపీ తరఫున ఎవరికి టికెట్ ఇచ్చినా వారిని గెలిపిస్తామని రాజమోహన్ రెడ్డి స్పష్టం చేశారు.
Mekapati Rajamohan Reddy
Chandrasekhar Reddy
MLC Elections
YSRCP
TDP
Udayagiri
Nellore District

More Telugu News