Raghu Rama Krishna Raju: నాకు 6 నెలలు హోం మంత్రి పోస్ట్ ఇవ్వండి.. నేనేంటో చూపిస్తా: రఘురామకృష్ణరాజు

  • గంజాయ్ సరఫరాను నియంత్రించలేని వారికి పదవి అవసరమా అని ప్రశ్నించిన రఘురాజు
  • సాక్షి ఛానల్, సాక్షి పేపర్ రెండూ జగన్ వే అని వ్యాఖ్య
  • దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్ అని విమర్శ
Give me home minister post I will show what Iam says Raghu Rama Krishna Raju

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి విమర్శలు గుప్పించారు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా ఏపీ నుంచే వచ్చిందని అంటున్నారని... తమ వైసీపీ పార్టీ వాళ్లే గంజాయి వ్యాపారం చేస్తున్నారని చెప్పుకుంటున్నారని ఆయన అన్నారు. గంజాయి సరఫరాను కూడా నియంత్రించలేని వారికి పదవి అవసరమా అని అన్నారు. ఈ విషయంలో జగన్ తనను తానే ప్రశ్నించుకోవాలని వ్యాఖ్యానించారు. తనకు 6 నెలలు హోంమంత్రి పదవి ఇస్తే తానేంటో చూపిస్తానని... గంజాయి అనే మాటే వినపడకుండా చేస్తానని చెప్పారు. గంజాయి తాగొద్దు బ్రో అనే నినాదాన్ని నారా లోకేశ్ ఇచ్చారని చెప్పారు. 

తనకు మీడియా లేదని జగన్ అంటున్నారని... మరి సాక్షి మీడియా ఎవరిదని రఘురాజు ప్రశ్నించారు. సాక్షి ఛైర్మన్ ఆయన భార్య వైఎస్ భారతీనే కదా అని అడిగారు. సాక్షి ఛానల్, సాక్షి పేపర్ రెండూ జగన్ వే నని అన్నారు. ఇతర కొన్ని తెలుగు మీడియాలు కూడా ఎవరి కోసం పని చేస్తున్నాయో అందరికీ తెలుసని చెప్పారు. తనపై కేసులు లేవని జగన్ అంటున్నారని... కానీ, ఎన్నికల అఫిడవిట్ లో కేసులు ఉన్నట్టు పేర్కొన్నారని అన్నారు. ఆర్థిక బలం, అంగ బలం లేదని చెప్పారని... దేశంలోనే అత్యంత ధనిక సీఎం జగన్ అని చెప్పారు. ఈ నాలుగేళ్లలో లిక్కర్, ఇసుక, మట్టిలో ఎంతో వెనుకేశారని ఆరోపించారు. అంబానీ, అదానీ తర్వాత దేశంలో జగనే సంపన్నుడు అని ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు.

More Telugu News