BRS: మొన్న పోస్టర్లు.. రేపు ధర్నాలతో మోదీకి స్వాగతం పలకనున్న బీఆర్ఎస్

KTR calls for protest against auctioning of SCCL coal mines
  • సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ రేపు మహాధర్నా చేయాలని కేటీఆర్ పిలుపు
  • ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, జిల్లా అధ్యక్షులకు ఆదేశం
  • వారితో ఫోన్ లో మాట్లాడి దిశా నిర్దేశం చేసిన కేటీఆర్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన, సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభలోనూ మోదీ పాల్గొననున్నారు. మోదీ టూర్ ను, బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసే పనిలోఉన్నారు. 

మరోవైపు ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్న రోజే బీఆర్ఎస్ ధర్నాలకు దిగనుంది. సింగరేణి బొగ్గు బ్లాకుల వేలాన్ని నిరసిస్తూ మహాధర్నా చేయాలని ఆ ప్రాంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, జిల్లా అధ్యక్షులను బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఈ మధ్య బీజేపీ అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వ్యంగ్య పోస్టర్లు ప్రచురిస్తూ రాష్ట్ర నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చాన్నాళ్ల నుంచి ప్రధానికి సీఎం కేసీఆర్ ఆహ్వానం పలకడం లేదు.

ఇప్పుడు మోదీ రాష్ట్రానికి వస్తున్న రోజే సింగరేణి బొగ్గు బ్లాకుల అంశంపై మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండంలో ధర్నా చేయాలని కేటీఆర్ ఆదేశించడం గమనార్హం. ధర్నా విజయవంతం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలను ఆదేశించారు. మే 30లోగా ఈ బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పూర్తి చేయాలంటూ కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ ను వెంటనే వెనక్కి తీసుకొని, వేలంతో సంబంధం లేకుండా సింగరేణికే ఈ బ్లాకులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ‘సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్ 12న రామగుండం పర్యటనలో ప్రధాని మోదీ చెప్పారు.. కానీ ఆ మాట నిలుపుకోకుండా ప్రైవేటీకరణకు కుట్ర చేస్తున్నారు. ఈసారి పురుడు పోసుకునే మహోద్యమంతో కేంద్రం కుప్పకూలుతుంది’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
BRS
Narendra Modi
Hyderabad
tour
ktr
protest
SCCL coal mines

More Telugu News