Alapati Raja: జగన్ తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ పెద్ద జోక్: ఆలపాటి రాజా

  • ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థకు శ్రీకారం
  • విమర్శనాస్త్రాలు సంధించిన టీడీపీ నేత ఆలపాటి రాజా
  • ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఎందుకూ పనికిరానిదని వ్యాఖ్యలు
  •  కేవలం 2,875 మంది వైద్యులతో సేవలందిస్తారా అన్న టీడీపీ నేత
Alapati Raja criticizes family doctor program

ఏపీలో ప్రజల వద్దకే వైద్యుడు కాన్సెప్టుతో సీఎం జగన్ ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రభుత్వాసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంత వైద్య సిబ్బంది, పరికరాలు, మందులు సమకూర్చలేని జగన్ ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థతో ప్రజల ప్రాణాలు కాపాడతామని చెప్పడం పెద్ద జోక్ అని అభివర్ణించారు. 

జగన్ తీసుకొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఎందుకూ పనికిరాదని, వైద్యరంగాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్ని నిర్లక్ష్యం చేసి, తగినంతమంది వైద్యులు, సిబ్బందిని నియమించకుండా కాలయాపన చేసిందని, పీ.హెచ్.సీలు ఉన్నాయో లేవో అనే అనుమానం ప్రజల్లో ఉందని తెలిపారు. 

“ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వాసుపత్రుల్లో తగినంత  సిబ్బందిని, వైద్యపరికరాలు, మందుల్ని అందించలేని ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థతో ప్రజలప్రాణాలు కాపాడుతుందా? చంద్రబాబు హయాంలో ప్రజలకు అందిన వైద్యసేవలెన్నో, ఇప్పుడు రాష్ట్రంలో అమలవుతున్న సేవలు ఏమిటో ప్రభుత్వం చెప్పగలదా? తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్, 108, 104 వాహన సేవలు, గిరిజన ప్రాంతాల్లో మొబైల్ వాహన సేవలు చంద్రబాబు హయాంలో నిర్విరామంగా పేదలకు అందుబాటులో నిలిచాయి. 

చంద్రబాబు ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించడనికి తీసుకొచ్చిన అనేకపథకాల్ని జగన్ రాగానే రద్దుచేశాడు.  జగన్ అధికారంలోకి వచ్చాక 108 వాహనాల్ని ఏ2 విజయసాయి వియ్యంకుడి కంపెనీకి ధారాదత్తంచేశాడు. 108 వాహనాలు ఎప్పుడు వస్తాయో, ఎక్కడ ఉంటాయో ప్రజలకు తెలియని పరిస్థితి కల్పించాడు. 

కరోనా సమయంలో ఆక్సిజన్ కూడా అందించలేక వందలాదిప్రాణాలు బలిగొన్న జగన్, ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ తో ప్రజల్ని రక్షిస్తాను అని చెప్పడం ముమ్మాటికీ పచ్చిబూటకం. జగన్ వైద్యులు, వైద్య సేవల గురించి ఆలోచించేవాడే అయితే ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో, ఎం.సీ.ఐ (మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా)తో ఎప్పుడైనా మాట్లాడారా? 

ఆరోగ్యశ్రీకి బడ్జెట్లో రూ.1300కోట్ల నిధుల్ని చూపి, క్షేత్రస్థాయిలో వాటిని విడుదల చేయలేని అసమర్థ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. జగన్ చెబుతున్న మాటలు, తీసుకొచ్చిన కార్యక్రమాలతో ఇప్పటివరకు ఎంతమందికి ఎలాంటి న్యాయం జరిగిందో చెప్పాలి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం కింద కేవలం 2,875 మంది వైద్యులతో రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు ఎలా అందుతాయో ముఖ్యమంత్రి చెప్పాలి. 

నాలుగేళ్లలో కేవలం 13,987 మంది వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బందిని నియమించిన జగన్, 49 వేల మందిని నియమించానని చెప్పడం పచ్చి అబద్ధం. ఆ 13,987 నియామకాలు కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగినవే” అని ఆలపాటి స్పష్టం చేశారు.

More Telugu News