secunderabad: ప్రధాని మోదీ రాక నేపథ్యంలో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఆంక్షలు

  • పదో నంబర్ ప్లాట్ ఫారంపైకి ఈ నెల 8న ప్రయాణికులకు నో ఎంట్రీ
  • రైళ్ల రాకపోకలను మిగతా ప్లాట్ పారాలపైకి మళ్లింపు
  • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న రైల్వే పోలీసులు
  • సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించనున్న ప్రధాని
Due to PM Modi tour officials restricted entry into secunderabad railway station platform no 10

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పలు ఆంక్షలు విధించారు. ఏప్రిల్ 8న ప్రధాని హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు పదో నంబర్ ప్లాట్ ఫారంతో పాటు రైల్వే స్టేషన్ లో కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీనిపై రైల్వే సిబ్బంది ప్రయాణికులకు ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నారు. పదో నంబర్ ప్లాట్ ఫారంపైకి వచ్చే రైళ్లను మిగతా ప్లాట్ ఫారాలపైకి మళ్లిస్తున్నారు.

మోదీ పర్యటన సందర్భంగా సెంట్రల్‌ పోలీస్‌, సీఆర్‌పీఎఫ్‌, ఆర్పీఎఫ్‌, ఐబీ ఇంటెలిజెన్స్‌ పోలీసులతో ప్లాట్ ఫారం 10 పై సెక్యూరిటీ ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్‌ సీసీ కంట్రోల్‌ రూంలో ఆర్పీఎఫ్‌ ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. తొలుత వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన తర్వాత అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ ను తీర్చిదిద్దేందుకు రూ.715 కోట్లతో చేపట్టబోయే పునరుద్ధరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. 

స్టేషన్ లో చేపట్టబోయే పనులు ఇవే..
ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల సామర్థ్యం 25 వేలు మాత్రమే.. దీనిని 3,25,000 మంది ప్రయాణికులకు పెంచేలా స్టేషన్ ను తీర్చిదిద్దనున్నారు. ప్రస్తుతం ఉన్న బిల్డింగ్ ఏరియాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేస్తారు. టెర్మినల్ బిల్డింగ్ నుంచి అన్ని ప్లాట్‌ఫామ్స్‌ను కలిపేలా 108 మీటర్ల ప్రత్యేక డబుల్ లెవెల్ వంతెనను ఏర్పాటు చేయనున్నారు. ఆధునికీకరణ పనులలో భాగంగా ఈస్ట్, వెస్ట్ మెట్రో స్టేషన్లకు, రైతిఫిల్ బస్‌స్టేషన్‌కు నేరుగా కనెక్టివిటీని ఏర్పాటు చేయనున్నారు. మల్టీలెవెల్ కార్ పార్కింగ్, ప్రయాణికులకు కోసం ప్రత్యేక మార్గాలు.. తదితర వసతులను అభివృద్ధి చేస్తారు.

More Telugu News