Kotamreddy Sridhar Reddy: ఏదో డాన్ ని ముట్టడించినట్టు.. నేను ఉంటున్న లేఔట్ మొత్తాన్ని రౌండప్ చేస్తారా?: పోలీసులపై కోటంరెడ్డి ఫైర్

Kotam Reddy fires on police for house arresting him
  • పొట్టేపాళెం కలుజు వంతెన మరమ్మతు పనులు చేయాలని కోటంరెడ్డి డిమాండ్
  • జలదీక్షకు వెళ్తున్న ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
  • డ్యూటీలు మానేసి ఎంతోకాలం తన చుట్టూ తిరగలేరన్న కోటంరెడ్డి
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. పొట్టేపాళెం కలుజు వంతెన మరమ్మతు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన జలదీక్షకు పిలపునిచ్చారు. అయితే, జలదీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనను ఇంటివద్దే అడ్డుకున్నారు. తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో ఆయన తన ఇంటి ఎదుటే దీక్షకు దిగారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి అనుచరులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కోటంరెడ్డి అనుచరులు నినాదాలు చేశారు. 

ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదో డాన్ ఇంటిని ముట్టడించినట్టు తాను ఉంటున్న మాగుంట లేఔట్ మొత్తాన్ని రౌండప్ చేస్తారా? అని మండిపడ్డారు. తాను కచ్చితంగా జలదీక్ష చేస్తానని చెప్పారు. మీరు డ్యూటీలు చేయడం మానేసి ఎంతో కాలం తన చుట్టూ తిరగలేరని అన్నారు. జలదీక్షకు అనుమతిని ఇవ్వాలని ఎస్పీని, డీఎస్పీని కోరానని... ఏవైనా సందేహాలు ఉంటే తనను అడగొచ్చు కదా? అని ప్రశ్నించారు. వంతెన నిర్మాణం కోసం ఫైల్ పై ముఖ్యమంత్రి జగన్ సంతకం చేశారని, కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. కోటంరెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో నెల్లూరులో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
Kotamreddy Sridhar Reddy
Jala Deeksha
House Arrest

More Telugu News