billion dollars: రూ.73,000 కోట్ల పరిహారానికి ముందుకొచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్

  • జాన్సన్ బేబీ టాల్కం పౌడర్ కు వ్యతిరేకంగా అమెరికాలో వేలాది వ్యాజ్యాలు
  • కేన్సర్ కు కారణమయ్యే ఆస్బెస్టాస్ ఆనవాళ్లు
  • 25 ఏళ్లలో రూ.73వేల కోట్ల చెల్లింపులకు జాన్సన్ సమ్మతి
Johnson Johnson proposes 9 billion dollars settlement for talc cancer claims

ముఖానికి రాసుకునే టాల్కం పౌడర్ ఉత్పత్తికి సంబంధించి అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ భారీగానే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఈ టాల్కం పౌడర్ కేన్సర్ కు కారణమవుతోందంటూ పెద్ద ఎత్తున వ్యాజ్యాలు అమెరికా కోర్టుల్లో దాఖలయ్యాయి. ఇప్పుడు 8.9 బిలియన్ డాలర్లు (రూ.73,000 కోట్లు) చెల్లించడం ద్వారా ఈ పిటిషన్లను పరిష్కరించుకునేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ ముందుకు వచ్చింది. 

కంపెనీ తాజా ప్రతిపాదనను అమెరికా దివాలా పరిష్కార కోర్టు ఆమోదించాల్సి ఉంటుంది. టాల్కం పౌడర్ పై ఎదురైన అన్ని న్యాయ వివాదాలను ప్రతిపాదిత పరిష్కారం సమర్థవంతంగా పరిష్కరించగలదన్న ఆశాభావాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ వ్యక్తం చేసింది. కంపెనీ ప్రతిపాదనకు కోర్టు, పిటిషనర్లు ఆమోదం తెలియజేస్తే.. అమెరికా చరిత్రలో ఓ ఉత్పత్తికి సంబంధించి అతిపెద్ద పరిహారం కేసుల్లో ఒకటిగా నిలవనుంది. సాధారణంగా పొగాకు ఉత్పత్తుల కంపెనీలకు ఇలాంటి భారీ పరిహార చెల్లింపు వ్యాజ్యాలు ఎదురవుతుంటాయి. 

కేన్సర్ కు దారితీసే ఆస్బెస్టాస్ ఆనవాళ్లు జాన్సన్ అండ్ జాన్సన్ టాల్కమ్ పౌడర్ లో ఉన్నాయంటూ అమెరికాలో వేలాది వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తమ ఉత్పత్తుల్లో హానికారకాలు లేవంటూనే, అమెరికా, కెనడాల్లో 2020 మే నుంచి బేబీ టాల్కమ్ పౌడర్ విక్రయాలను కంపెనీ నిలిపివేసింది. రూ.73,000 కోట్లను ఒకేసారి కాకుండా వచ్చే 25 ఏళ్లలో చెల్లించేందుకు జాన్సన్ అండ్ జాన్సన్ సమ్మతి తెలియజేసింది. పిటిషన్ దారులు ఆరోపిస్తున్న వాటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నది జాన్సన్ వాదన.

More Telugu News