Revanth Reddy: నేను పీసీసీ చీఫ్ గా ఉన్నంతవరకు బీఆర్ఎస్ తో పొత్తు ఉండదు: రేవంత్ రెడ్డి

  • ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి
  • బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే ప్రసక్తేలేదని తేల్చిచెప్పిన టీపీసీసీ చీఫ్
  • ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడి
  • తెలంగాణ ప్రజల్లో 80 శాతం మంది కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని వ్యాఖ్యలు
Revanth Reddy chit chat with media in New Delhi

తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాను పీసీసీ చీఫ్ గా ఉన్నంతవరకు బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ ను క్షమించేది లేదని స్వయంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ తో సంబంధాలు కలిగివున్న వారిని ఎంతవారైనా ఉపేక్షించవద్దని రాహుల్ చెప్పారని వివరించారు. ఎన్నికలకు 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తామని తెలిపారు.  

బీఆర్ఎస్ ఒక మాఫియా వంటిదని, మాఫియాతో కాంగ్రెస్ ఎన్నటికీ కలవదని స్పష్టం చేశారు. కేసీఆర్ రాజకీయాలు కూడా దావూద్ ఇబ్రహీం తరహాలోనే ఉన్నాయని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బీఆర్ఎస్... పరోక్షంగా బీజేపీ... ఎంఐఎంకు మద్దతు ఇచ్చాయని ఆరోపించారు. బీజేపీకి హైదరాబాదులో 50 మంది కార్పొరేటర్లు, ఓ కేంద్రమంత్రి, ఓ ఎమ్మెల్యే ఉన్నా పోటీ పెట్టకపోవడమే అందుకు నిదర్శనం అని చెప్పారు. 

తెలంగాణ ప్రజల్లో 80 శాతం మంది ప్రజలు కేసీఆర్ ను వ్యతిరేకిస్తున్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీతో చేయి కలిపి కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కుట్ర పన్నాడని, బీజేపీ ప్రణాళికను కేసీఆర్ అమలు చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కాంగ్రెస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు తమకు 80 సీట్లు ఇవ్వాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. 80 సీట్ల కంటే తక్కువ ఇస్తే ప్రజలకే నష్టమని అన్నారు. 

ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ కు 25 కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు. బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితం అని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఈసారి కరీంనగర్ లో పోటీచేసి గెలవగలరా? అంటూ రేవంత్ సవాల్ విసిరారు. ఇక, వైస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలవి ఎన్జీవో రాజకీయాలు అని విమర్శించారు.

More Telugu News