Siddaramaiah: సీఎం పదవి కోసం డీకేతో పోటీ... హీట్ పెంచుతున్న సిద్ధరామయ్య కామెంట్స్

  • కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు
  • కాంగ్రెస్ లో సీఎం పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య, డీకే శివకుమార్
  • పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలే సీఎంను ఎంపిక చేస్తారన్న సిద్దూ
Siddaramaiah Vs DK Shivakumar in Karnataka Congress

కర్ణాటక అసెంబ్లీకి మే 10న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపును అన్ని ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. వివిధ పార్టీల కీలక నేతలంతా ప్రచారపర్వంలో మునిగిపోయారు. మరోవైపు, ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ లో సీఎం ఎవరనే లొల్లి ప్రారంభమయింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ట్రబుల్ షూటర్ గా పేరుగాంచిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ లు సీఎం పదవిని ఆశిస్తున్నారు. 

సిద్ధరామయ్య చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా వేడిని పెంచుతున్నాయి. తాను కూడా సీఎం కావాలని అనుకుంటున్నానని... ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ ఇటీవల ఆయన కామెంట్ చేసి వివాదానికి ఆజ్యం పోశారు. తాజాగా ఆయన మరోసారి ఇదే అంశంపై మాట్లాడుతూ... కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం చాలా ఎక్కువగా ఉంటుందని అన్నారు. సీఎం ఎవరు కావాలనేది పార్టీ అధినాయకత్వం నిర్ణయించదని... కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలే సీఎంగా ఎవరుండాలనేది నిర్ణయిస్తారని చెప్పారు. 

సీఎంను హైకమాండ్ నిర్ణయించడం జరగదని సిద్ధరామయ్య అన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలోనే జరగాలని చెప్పారు. మరోవైపు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య దశాబ్దాలుగా రాజకీయపరమైన వైరం ఉంది. ఒకే పార్టీలో అత్యున్నత స్థానాల్లో ఉన్నప్పటికీ... ఎవరిదారి వారిదే అన్నట్టుగా వ్యవహరిస్తుంటారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా కూడా ఏదో తప్పదన్నట్టుగా ఇద్దరూ కలిసి పాల్గొన్నారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారాన్ని కూడా ఎవరికి వారే నిర్వహిస్తున్నారు. 

అయితే ఈ ఇద్దరు నేతలు కూడా ఒక విషయంలో మాత్రం ఒకే విధమైన అభిప్రాయంతో ఉన్నారు. కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ రావచ్చని, అప్పుడు జేడీఎస్ నేత కుమారస్వామితో కొత్త పొత్తు అవసరమవుతుందనే అభిప్రాయాన్ని ఇద్దరూ కొట్టిపారేశారు. ఎవరి అవసరం లేకుండానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇద్దరూ చెపుతున్నారు. మరోవైపు, మే 13న కౌంటింగ్ జరగనుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం ఆ రోజున తేలిపోతుంది.

More Telugu News